ఆదరణ పథకం ద్వారా సహకారం

ఆదరణ పథకం ద్వారా సహకారం

ఆదరణ పథకం ద్వారా 4 విడతల వారీగా విజయనగరం జిల్లాలో అర్హత ఉన్న 30 వేల మందికి సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారని మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు తెలిపారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఫుట్ బాల్ గ్రౌండ్ లో 'పేదరికంపై గెలుపు' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు, ఎమ్మేల్యే నారాయణ స్వామి మరియు ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టిన ఆదరణ కార్యక్రమం ఎంతో మందికి ఉపయోగపడిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అదనంగా ఎన్నో చేస్తున్నారు.. ఎన్నికల్లో చెప్పకపోయినా చంద్రన్న భీమా, యువనేస్తం లాంటివి ఎన్నో అందుబాటులో తెచ్చారు. నిరుద్యోగులకు కావాల్సిన శిక్షణ అందించి అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటోంది. గతంలో ఆదరణ పథకం ఏ విధంగా ఉపయోగపడిందో ఈ సారి కూడా అలాగే ఉపయోగపడుతుంది. 4 నెలల్లో 8 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధి చేకుర్చనున్నారు. అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేసి రుణాలు అర్హులకు మంజూరు చేస్తున్నారని సుజయ్ కృష్ణ రంగారావు తెలిపారు.

కుటుంబానికి 10 వేల కన్నా తక్కువ ఆదాయం ఉండకూడదు.. సంపాదన పెంచడానికి కృషి చేస్తున్నామని సుజయ్ కృష్ణ రంగారావు పేర్కొన్నారు. గతంలో బ్యాంకు రుణాలు పొదుపు సంఘాలు ఖర్చుల కోసం వినియోగించేవారు. ఇప్పుడు వ్యాపారాలు చేసి ఆదాయం పెంచుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారన్నారు. 4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం అంటే ఖజానాలో డబ్బులు ఎక్కువై కాదు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా.. ప్రజలకు లబ్ధి చేకూర్చేలా చంద్రబాబు కృషి చేస్తున్నారు. సబ్సిడీలో వచ్చిన పరికరాలను అమ్ముకోకుండా వాటిని వినియోగించుకుని ఆర్థికంగా పైకి రావాలన్నారు. మిమ్మల్ని ఆదరించి, ప్రోత్సహించే ప్రభుత్వానికి ప్రజలందరూ సహకరించాలని సుజయ్ కృష్ణ రంగారావు కోరారు.