రైతుల తలరాత మార్చే నేత కేసీఆర్‌

రైతుల తలరాత మార్చే నేత కేసీఆర్‌

ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువగా నష్టపోయింది పాలమూరు జిల్లానే అని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. భూత్పూర్‌లో రైతులకు చెక్కుల పంపిణీ అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కృష్ణా నది పక్కనే ఉన్నా వాడుకోలేని పరిస్థితి పాలమూరు జిల్లా రైతులది అని అన్నారు. కరివేన రిజర్వాయర్ పూర్తయితే భూత్పూర్ ప్రాంతంలోనే 60 వేల ఎకరాలకు సాగునీరు వస్తుంది అని తెలిపారు. పాలమూరు జిల్లాలో ఆయకట్టు లక్ష నుంచి ఏడు లక్షల ఎకరాలకు పెరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఉద్దేశ పూర్వకంగానే ఆనాడు పాలకులు కృష్ణా నదిపై పాలమూరులో ప్రాజెక్టులు నిర్మించలేదు. అప్పట్లో బూర్గుల రామకృష్ణ రావు అప్పర్ కృష్ణ ప్రాజెక్టు కోసం యత్నిస్తే.. సమైక్య రాష్ట్రం ఏర్పడ్డాక మరిచారు అని అన్నారు.

సీఎం కేసీఆర్ కు భూనిర్వాసితుల సమస్యలు తెలిసినంత ఎవ్వరికీ తెలియదు అని చెప్పారు. మా పూర్వీకుల భూములు ప్రాజెక్టుల కోసం పోయాయి.. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అరుణల భూములు ఎక్కడా పోలేదు అని ఎద్దేవా చేశారు. 24 గంటల కరెంటు తర్వాత.. ఇంకా రైతులకు ఏదో చేయాలని సీఎం కేసీఆర్ రైతుబంధు పథకంను ప్రవేశపెట్టారన్నారు. దేశంలో ఏ నాయకుడికీ రాని ఆలోచన, కార్యక్రమాన్ని సీఎం చేపట్టారని తెలిపారు. రైతన్నను సంపూర్ణ మనసుతో అర్థం చేసుకొని రైతుబంధు పథకం చేపట్టారని మంత్రి కేటీఆర్ తెలిపారు. రైతుల తలరాతలు మారాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు. నకిలీ విత్తన వ్యాపారుల ఆటలు ఇక సాగవు అని హెచ్చరించారు.

సీఎం కేసీఆర్ డిల్లీలో రాజ్ నాథ్ సింగ్ తో రైతుబంధు పథకం గురించి వివరించినపుడు.. రాజ్ నాథ్ సింగ్ ఆశ్చర్యంలో మునిగిపోయారు అని తెలిపారు. అయితే రైతుబంధు పథకం గత ఏడాది నుంచి ఉన్న ఆలోచనే.. ముందుగా భూ ప్రక్షాళన, కొత్త పాస్ బుక్ లను చేసేందుకు సమయం పట్టింది అని తెలిపారు. రైతు రుణమాఫీ కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐలు మొండికేస్తేనే నాలుగు విడతలుగా చేయాల్సి వచ్చింది అని పేర్కొన్నారు. పాలమూరును దత్తత తీసుకున్న ఒకరు.. ఉద్దరిస్తామని చెప్పిన మరొకరు రైతులను రాబందుల్లా పీక్కు తింతుంటే సీఎం కేసీఆర్ రైతులకు బందువుగా మారాడని అన్నారు.

నీటి తీరువా డబ్బు మాఫీ చేసాం. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం, మద్దతు ధర 25 శాతం పెంచాలని కోరాం. ఈ రెండు అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేకుంటే.. ఎప్పుడో సీఎం కేసీఆర్ అమలు చేసేవారు అని అన్నారు. వ్యవసాయం పండుగగా మారేవరకు రైతుబంధు కొనసాగుతుంది అని హామీ ఇచ్చారు. మీకు దమ్ముంటే రైతుబంధు పథకాన్ని వద్దని చెప్పండి.. రైతులు ఏం చేస్తారో చూడండి అని ప్రతిపక్షాలకు సవాల్ విసిరాడు. రైతుబంధు పథకం గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరగాలన్నదే మా ఆశయం అని తెలిపారు. ఇంత మంచి కార్యక్రమంలో కూడా కొందరు కోడిగుడ్డు మీద ఈకలు పీకే యత్నం చేస్తున్నారు అని విమర్శించారు. అమ్మకు అన్నం పెట్టని వాడు చిన్నమ్మకు గాజులు చేయిస్తామన్నట్లు ఉంది ప్రతిపక్షల వైఖరి అని ఎద్దేవా చేసాడు.