చెక్కుల్లో తప్పులు.. రైతులకు చిక్కులు

చెక్కుల్లో తప్పులు.. రైతులకు చిక్కులు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకానికి ఆదిలోనే ఇబ్బందులెదురవుతున్నాయి. శాఖల మధ్య సమన్వయ లోపం.. రైతులకు నష్టం చేకూర్చుతోంది. రైతు ఖాతా సంఖ్య, సాగు భూమి విస్తీర్ణం, అందించాల్సిన నగదు ముద్రణ విషయంలో తప్పులు దొర్లినట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా అధిక శాతంమంది పాస్‌పుస్తకాలు, చెక్కులపై లబ్ధిదారుల పేర్లు తప్పుగా ముద్రించినట్టు గుర్తించారు. ఇలాంటి చెక్కుల పంపిణీ నిలిచిపోనుండడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. కొన్నిచోట్ల ఇప్పటికే ముద్రించిన చెక్కుల్లో సాగు భూమి విస్తీర్ణం, పెట్టుబడి సాయం కింద అందించే మొత్తానికి మధ్య తేడాలు ఉన్నట్లు తెలుస్తోంది. తక్కువ భూమికి ఎక్కువ మొత్తం ముద్రించడం, ఎక్కువ భూమికి తక్కువ మొత్తం ముద్రణ వంటి తప్పులు చోటుచేసుకున్నాయి.

ఇటువంటి ముద్రణ లోపాలు మెదక్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, నిర్మల్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల్లో ఎక్కువ గుర్తించారు. ఇటువంటి వారికి పెట్టుబడి సాయం ఎలా అందిస్తారనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలు. సాగు భూమి విస్తీర్ణం కంటే ఎక్కువ మొత్తం ముద్రించి ఉంటే అటువంటి చెక్కుల పంపిణీని నిలిపివేస్తున్నారు. తక్కువ మొత్తం ముద్రించి ఉంటే మిగిలిన మొత్తానికి రెండో చెక్కు ఇస్తామని రైతును ఒప్పించి ప్రస్తుత చెక్కులను పంపిణీ చేస్తున్నట్టు తెలిసింది.  పెద్దమొత్తంలో చెక్కుల ముద్రణ కావడంతో కొన్ని పొరపాట్లు జరిగి ఉంటాయని అధికారులంటున్నారు.