తొలి వన్డేకు మిచెల్‌ మార్ష్ దూరం

తొలి వన్డేకు మిచెల్‌ మార్ష్ దూరం

సొంత గడ్డపై 2-1తో టెస్ట్ సిరీస్ కోల్పోయి విమర్శలను ఎదుర్కుంటున్న ఆస్ట్రేలియాకు.. వన్డే సిరీస్‌ ముందు ఎదురుదెబ్బ తగలింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం సిడ్నీ వేదికగా తొలి వన్డే జరగనుంది. ఈ వన్డేకు ఆల్‌ రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ దూరమయ్యాడు. జీర్ణాశయ సమస్యతో బాధపడుతున్న మార్ష్‌.. తొలి వన్డేలో పాల్గొనడం లేదని ఆసీస్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మార్ష్ మిగతా రెండు వన్డేలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. మిచెల్‌ మార్ష్‌ స్థానంలో ఆస్టాన్‌ టర్నర్‌ను జట్టులోకి తీసుకున్నామని కోచ్‌ తెలిపారు.

2017లో టర్నర్‌ ఆసీస్ తరపున మూడు టీ-20లు ఆడాడు. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ అయిన టర్నర్‌ పార్ట్‌టైమ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ కూడా. బిగ్‌బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌)లో టర్నర్‌ పెర్త్‌ స‍్కార్చర్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. ఆస్టన్‌ బీబీఎల్‌లో ఆడిన చివరి మూడు మ్యాచ్‌ల్లో 60 నాటౌట్‌, 47, 43 నాటౌట్‌తో సత్తా చాటాడు. అంతేకాదు ఆస్టన్‌ వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తగలడు.