బాబుకు అందుకే నేను నచ్చను: మోడీ

బాబుకు అందుకే నేను నచ్చను: మోడీ

ఏపీకి ఇచ్చిన నిధుల లెక్కలు చెప్పమని సీఎం చంద్రబాబును అడిగానని.. కానీ లేక్కలు చెప్పే అలవాటు ఆయనకు లేనట్టుందని.. లెక్క అడిగితే ఎందుకు అంత భయపడుతున్నారని ప్రధాని మోడీ ప్రశ్నించారు. ఇవాళ గుంటూరులో ఆయన మాట్లాడుతూ అమరావతి నుంచి పోలవరం వరకు అన్ని నిధులకు లెక్కలు అడగడం తన బాధ్యత అని అన్నారు. లెక్కలడిగినందుకే బాబుకు తనపైన కోపమని.. కానీ ప్రతి పైసా లెక్కా రాబడతామని చెప్పారు.  ప్రజలు అధికారం ఇచ్చేది ఆస్తులు పెంచుకోవడానికి కాదని.. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి అని అన్నారు. 

'ఈ సభకు బీజేపీ కార్యకర్తలే ఖర్చు పెట్టారు. ఇందులో ప్రభుత్వ ఖర్చు కేవలం చిన్న టెంట్ వరకు మాత్రమే. కానీ చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు ఫోటోలు తీయించుకోవడానికి ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ వెళ్తున్నారు. దీనిపై ఆయన ప్రజలకు లెక్క చూపించాల్సిందే' అని అన్నారు. 'తాను ఏపీకి వస్తుంటే బాబుకు భయం పట్టుకుంది..అందుకే గోబ్యాక్‌, గోబ్యాక్‌ అన్నారు.  అవును.. మళ్లీ నేనే ఢిల్లీ వెళ్లి ప్రధాని పీఠంపై కూర్చోబోతున్నాను' అని మోడీ చెప్పారు. 

ఏపీకి ప్రత్యేక హోదా కంటే ఎక్కువ లాభం వచ్చేలా  ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని.. కానీ ఆ ప్యాకేజీ తీసుకున్నాక చంద్రబాబు యూ టర్న్‌ తీసుకున్నారని ప్రధాని మోడీ అన్నారు. ప్యాకేజీ కింద ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పలేకే బాబు అడ్డం తిరిగారని అన్నారు. ఈ 55 నెలలు ఏపీకి ఇబ్బందులు లేకుండా చూశామన్న ఆయన..  ప్రత్యేక ప్యాకేజీ కి ధన్యవాదాలు చెబుతూ చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారని అన్నారు.  విభజన చట్టంలో హామీల అమలుకి పదేళ్ల సమయం ఉందని.. కానీ మొదటి నాలుగేళ్లలోనే తాము ఎక్కువ హామీలు అమలు చేశామని చెప్పారు. ఏపీకి అన్యాయం చేసింది చంద్రబాబేనని.. తాను కాదని మోడీ స్పష్టం చేశారు.