అబ్బో.. ధోనీ ఎంత స్పీడో!!

అబ్బో.. ధోనీ ఎంత స్పీడో!!

వికెట్ల వెనుక ఎంఎస్ ధోనీ తప్పులు చేయడం చాలా అరుదు. ముఖ్యంగా స్టంపింగ్ లు చేయడంలో ధోనీకి సాటివచ్చే మొనగాడు దరిదాపుల్లో లేడు. అందుకే ఎంఎస్డీని ప్రపంచ అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడిగా పరిగణిస్తారు. ఇవాళ హ్యామిల్టన్ లో న్యూజిలాండ్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో కూడా మాహీ తన సత్తా ఏంటో చాటాడు. కివీ ఓపెనర్ టిమ్ సీఫర్ట్ ని కళ్లు చెదిరే స్టంపౌట్ చేశాడు.

కాలిన్ మన్రో, సీఫర్ట్ న్యూజిలాండ్ జట్టుకి అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. భారత బౌలర్లను చితక్కొడుతూ మైదానం నలువైపులా పరుగుల వరద పారించారు. ఆ సమయంలో ఎనిమిదో ఓవర్ వేసిన చైనామ్యాన్ కుల్దీప్ యాదవ్ టీమిండియాకు కావాల్సిన వికెట్ సాధించాడు. నిజానికి ఆ క్రెడిటంతా ధోనీ ఖాతాలోకే చేరాలి. వికెట్ల వెనుక ఉన్న మిస్టర్ కూల్ రెప్పపాటులో బంతిని అందుకొని వికెట్లు గిరాటేశాడు. 

స్టంపింగ్ చేసిన తర్వాత తను కచ్చితంగా ఔట్ చేసినట్టు ధోనీ విశ్వాసంగా కనిపించాడు. థర్డ్ అంపైర్ పరిశీలనలో కూడా సీఫర్ట్ కాలు క్రీజుకి ఇంకా అంగుళం దూరంలో ఉన్నట్టు స్పష్టమైంది. దీంతో 25 బంతుల్లో 43 పరుగులు చేసిన సీఫర్ట్ పెవిలియన్ ముఖం పట్టక తప్పలేదు.