వైరల్ వీడియో: కేదార్ జాదవ్ కి మరాఠీలో ధోనీ సలహా

వైరల్ వీడియో: కేదార్ జాదవ్ కి మరాఠీలో ధోనీ సలహా

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలో దిగాడంటే ఆటకి తన 100% శక్తియుక్తులు ధారపోస్తాడు. బ్యాటింగైనా, వికెట్ కీపింగైనా ఎంఎస్ తనదైన ముద్ర వేస్తాడు. చాలా సార్లు ఎంఎస్డీ వికెట్ల వెనుక నుంచి బౌలర్లకు సలహాలు ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం. ఆ సలహాలు జట్టు విజయానికి దోహదపడిన సంగతీ మనకు తెలుసు. అందుకే మాహీ ’క్రికెటింగ్ సెన్స్‘ అద్భుతమని ప్రపంచం వేనోళ్ల కొనియాడుతుంది. న్యూజిలాండ్ తో వెల్లింగ్టన్ లో జరిగిన ఐదో వన్డేలో కూడా మహేంద్రుడు కేదార్ జాదవ్ కి బాల్ ఎక్కడ వేయాలో సలహా ఇచ్చాడు. ధోనీ చెబుతున్న మాటలను స్టంప్ మైక్ క్యాచ్ చేసేసింది. ఇందులో విశేషం ఏంటంటే ధోనీ మరాఠీలో జాదవ్ కి సలహాలు ఇస్తున్నాడు.

వెల్లింగ్టన్ లో జరిగిన ఐదో వన్డేలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో 39వ ఓవర్ కేదార్ జాదవ్ వేస్తున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ల వెనుక నుంచి కేదార్ జాదవ్ మాతృభాష అయిన మరాఠీలో అరుస్తూ ‘పుఢే నాకో భావూ.. ఘెవూన్ టాక్..’ అని అరిచాడు. దీని అర్థం ‘బంతి ముందుకు వేయొద్దు.. ఔట్ చేయి’ అని. ధోనీ మరాఠీ మాట్లాడటం విని సాక్షాత్తూ కేదారే ఆశ్చర్యపోయాడు. ఎంఎస్ ధోనీ ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మాహీ మరాఠీని ఇంటర్నెట్ లో క్రికెట్ అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.