వాడుకుని వదిలేశారు: ముద్రగడ

వాడుకుని వదిలేశారు: ముద్రగడ

తాము ఏ పార్టీకి మద్దతిస్తామో ఎన్నికలకు నాలుగు నెలల ముందు ప్రకటిస్తామని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఇవాళ ఆయన శ్రీకాకుళంలో మాట్లాడుతూ కాపులకు న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చినవారికే తమ మద్దతు ఉంటుందని అన్నారు. తమ జాతిని రాజకీయంగా ఉపయోగించుకుని రోడ్డున పడేసిన చంద్రబాబునాయుడును, టీడీపీని గద్దె దించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. చంద్రబాబు చేసిన మోసాన్ని రాష్ట్రం నలుమూలలా తిరిగి అందరికీ వివరిస్తామని అన్నారు. ప్రస్తుతం తాము ఏ పార్టీకీ మద్దతివ్వడం లేదని ముద్రగడ స్పష్టం చేశారు. రాజకీయంగా చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయని, రెండున్నరేళ్ల తమ పోరాట కష్టాన్ని వృథాకానివ్వమని తెలిపారు. 

'నేను మారాను నన్ను నమ్మండి అంటూ బాబు ఇంటింటికీ తిరిగి కాపు ఓట్లు అడుక్కుంటున్నారు, బీజేపీతో తెగదెంపుల తర్వాత కేంద్రానికి మా బిల్లు పంపించి మోసం చేశారు' అని ముద్రగడ వెల్లడించారు. కుటుంబం అభివృద్దే లక్ష్యంగా బాబు రాజకీయాలు చేస్తున్నారని... కాపు ఉద్యమాన్ని వైసీపీ నడిపిస్తోందని విమర్శించడం విడ్డూరంగా ఉందని తెలిపారు. అసలు వైఎస్ కుటుంబంతో లబ్ధి పొందింది చంద్రబాబేనని.. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు నెంబర్ ప్లేట్ లేని కారులో వెళ్లి రాజశేఖర్ రెడ్డి కాళ్లు పట్టుకుంది చంద్రబాబేనని ముద్రగడ వివరించారు.