మేడ్చల్ లో మరో పరువు హత్య

మేడ్చల్ లో మరో పరువు హత్య

రాష్ట్రంలో పరువు హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు గుర్తుతెలియని వ్యక్తులు మహిళను, పసికందును దారుణంగా హత్య చేసి కాల్చి బూడిద చేశారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే వరంగల్‌ జిల్లా బొల్లికుంట గ్రామానికి చెందిన సుశ్రుత అనే యువతి రెండు సంవత్సరాల క్రితం జనగామ జిల్లా పాలకుర్తి మండలం గుడూరు గ్రామానికి చెందిన రమేష్‌ అనే యువకుడ్ని ప్రేమించింది. సుశ్రుత, రమేష్‌ల కులాలు వేరుకావటంతో రమేష్‌ కుటుంబసభ్యులు వారి పెళ్లికి నిరాకరించారు. దీంతో వారు ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. కాగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను, పసి బాలుడిని హత్యచేసి, కాల్చి బూడిద చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. మృతులు ఇద్దరు సుశ్రుత, ఆరు నెలల ఆమె కుమారుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది కచ్చితంగా పరువు హత్య అయి ఉండవచ్చని బోల్లికుంట గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.