బౌలర్‌కు చుక్కలు... ఒకే ఓవర్‌లో 43 పరుగులు

బౌలర్‌కు చుక్కలు... ఒకే ఓవర్‌లో 43 పరుగులు

ఒకే ఓవర్‌లో 43 పరుగులు చేసి ఔరా? అనిపించారు న్యూజిలాండ్ క్రికెటర్లు... వరుసగా 4, 6+నోబాల్, 6+నోబాల్, 6, 1, 6, 6, 6... ఇలా మొత్తం ఆరు సిక్సులు, ఒక ఫోర్, ఒక సింగిల్‌కు తోడు రెండు నోబాల్స్‌తో ఒకే ఓవర్‌లో 43 పరుగులు రాబట్టి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ అరుదైన రికార్డుకు న్యూజిలాండ్‌లో జరిగిన నార్తన్ డిస్ట్రిక్ట్స్, సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ మధ్య జరిగిన దేశవాలీ వన్డే మ్యాచ్‌ వేదికైంది. చెలరేగిన నార్తన్ డిస్ట్రిక్ట్స్‌ బ్యాట్స్‌మెన్లు జో కార్టర్, బ్రెట్ హాప్టన్‌లు ఈ ఘనత సాధించారు. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ విల్లెమ్ లూడిక్‌కు చుక్కులు చూపిస్తూ గత రికార్డులను తిరగరాశారు. యువ క్రికెటర్లు బ్యాటింగ్‌తో రెచ్చిపోవడంతో నార్తన్ డిస్ట్రిక్ట్స్‌ 7 వికెట్లు కోల్పోయి 313 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో విజయం సాధించారు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో అత్యధికంగా 36 పరుగుల రికార్డు ఉంది. వన్డే క్రికెట్‌లో 2007లో గిబ్స్ ఆరు వరుస సిక్సర్లతో విధ్వంసం సృష్టించగా... టీ20 ఇంటర్నేషనల్‌లో యువరాజ్ సింగ్ ఆరు వరుస బంతులను సిక్సులుగా మలిచి 36 పరుగులు రాబట్టాడు.