నేడు న్యూజిలాండ్‌తో మూడో టీ20

నేడు న్యూజిలాండ్‌తో మూడో టీ20

హామిల్టన్ వేదికగా ఈ రోజు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్‌ జరగనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో చెరో మ్యాచ్ గెలువడంతో.. మూడు టీ20 సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం. ఈ మ్యాచ్ గెలిచి విదేశీ గడ్డపై మరో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని భారత్ చూస్తోంది. వన్డే సిరీస్‌ను కోల్పోయిన కివీస్.. కనీసం పొట్టి ఫార్మాట్‌ సిరీస్‌ను అయినా చేజిక్కించుకోవాలని భావిస్తోంది.

తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఎలాంటి మార్పులు చేయకుండా అదే జట్టుతో బరిలోకి దిగింది. చివరి టీ20కి కూడా అదే జట్టును కొనసాగించే అవకాశం ఉంది. భువనేశ్వర్‌, ఖలీల్‌, హార్దిక్ పాండ్యా పేస్ బౌలింగ్ ను పంచుకోనున్నారు. కృనాల్ ఈ మ్యాచ్‌లో కీలకం కానున్నాడు. అయితే చాహల్ స్థానంలో కుల్దీప్ వచ్చే అవకాశాలున్నాయి. దీంతో బౌలింగ్ విభాగం పటిష్టంగానే ఉంది. ఓపెనింగ్‌లో రోహిత్, ధవన్‌లు ఫామ్ అందుకున్నారు. ధోనీ, రిషబ్, ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌తో మిడిలార్డర్ పటిష్ఠంగానే ఉంది. ఆల్‌రౌండర్లుగా హార్దిక్, కృనాల్ లు మెరుపులు మెరిపిస్తే భారత్ విజయం సాధించొచ్చు.

న్యూజిలాండ్ మాత్రం బ్యాటింగ్‌పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. సీఫెర్ట్, మున్రోలు కీలకం కానున్నారు. విలియమ్సన్, టేలర్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. మిడిలార్డర్‌లో ఆల్‌రౌండర్ మిచెల్, నీషమ్.. లోయర్ ఆర్డర్‌లో గ్రాండ్‌హోమీ, సాంట్నెర్లు విలువైన పరుగులు జోడించే సత్తా గలవారు ఉన్నారు. దీంతో కివీస్ కు లోతైన బ్యాటింగ్ లైన్ అప్ ఉంది. ఇక బౌలింగ్‌లో సౌతీ ఆకట్టుకుంటున్నాడు. ఫెర్గుసన్ స్థానంలో సెంట్రల్ డిస్ట్రిక్ట్ పేసర్ బ్లేయర్ టిక్నెర్‌కు అరంగేట్రం అవకాశం దక్కొచ్చు. 

జట్ల అంచనా:

భారత్: 
రోహిత్ (కెప్టెన్), ధవన్, రిషబ్, శంకర్, ధోనీ, హార్దిక్, కృనాల్, భువనేశ్వర్, కుల్దీప్, ఖలీల్, చాహల్.

న్యూజిలాండ్: 
విలియమ్సన్ (కెప్టెన్), సీఫెర్ట్, మున్రో, టేలర్, మిచెల్, నీషమ్, గ్రాండ్‌హోమీ, సాంట్నెర్, సౌతీ, సోధీ, టిక్నెర్.