పోరాడి ఓడిన భారత్

పోరాడి ఓడిన భారత్

భారత మహిళలతో హామిల్టన్‌ వైదికగా ముగిసిన మూడో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ మహిళలు విజయం సాధించారు. లక్ష్య ఛేదనలో భారత మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయడంతో.. కివీస్ మహిళలు 2 పరుగుల తేడాతో గెలిచారు. దీంతో కివీస్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. 162 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ ప్రియా పూనియా (1) త్వరగానే పెవిలియన్ చేరింది. మరో ఓపెనర్ స్మృతి మంధాన.. జెమీమా రోడ్రిగ్స్‌తో కలిసి ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టింది. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ చేసింది. అనంతరం రోడ్రిగ్స్‌ (21), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (2), మంధాన (86) అవుట్ అయ్యారు. ఇక చివరి రెండు ఓవర్లలో భారత్ విజయానికి 23 పరుగులు అవసరం కాగా.. క్రీజులో ఉన్న మిథాలీ, దీప్తిలు 19వ ఓవర్ లో 7 పరుగులు చేశారు. చివరి ఓవర్ లో 16 పరుగులు అవసరంకాగా 13 పరుగులు చేయడంతో కివీస్ విజయం సాధించింది. 

అంతకుముందు న్యూజిలాండ్ మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేశారు. ఓపెనర్ డివైన్ హాఫ్‌ సెంచరీ (72: 52 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేసింది. కెప్టెన్‌ అమీ సట్టెర్‌వైట్‌ (31), సుజీ బెట్స్‌(23)లు రాణించారు. డివైన్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్', 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్'లు దక్కాయి.