నష్టాలతో ముగిసిన నిఫ్టి

నష్టాలతో ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు నిస్తేజంగా ఉన్నాయి. వరుసగా భారీ లాభాలు గడించిన మార్కెట్లు ఇపుడు కాస్త చల్లబడ్డాయి. రాత్రి అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు  లాభాలు పొందినా.. ఉదయం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. జపాన్‌ నిక్కీ నష్టాల్లో క్లోజ్‌ కాగా ఇతర మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. మిడ్‌ సెషన్‌ లో ప్రారంభమైన యూరో మార్కెట్లు కూడా మిశ్రమంగా ఉన్నాయి. పెద్ద మార్కెట్లయిన జర్మనీ, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ మార్కెట్లు నష్టాల్లో ఉండగా,  ఇతర మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. అయితే లాభనష్టాలు పెద్దగా లేవు. అంతా నామమాత్రమే. ఇక మన మార్కెట్లు కూడా ఇదే ట్రెండ్‌లో ట్రేడయ్యాయి. ఉదయం నుంచి ఒక మోస్తరు నష్టాలకే పరిమితమైన మార్కెట్లు స్వల్ప నష్టంతో క్లోజయ్యాయి. 10801 కనిష్ఠ స్థాయి కాగా, గరిష్ఠ స్థాయి 10859. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 33 పాయింట్లు క్షీణించి 10,821 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 106 పాయింట్లు క్షీణించింది. గురువారం కావడంతో బ్యాంక్‌ ఇండెక్స్‌ వీక్లీ క్లోజింగ్‌ అర శాతం పైనే నష్టంతో క్లోజైంది.

ముఖ్యంగా గతవారం రోజుల్లో భారీగా పెరిగిన ప్రైవేట్‌ బ్యాంకుల షేర్లు ఇవాళ ఒక మోస్తరు నష్టాలతో క్లోజయ్యాయి. ఇతర షేర్లలో పెద్దగా మార్పులు లేవు. జేఎల్‌ఆర్‌ అమ్మకాల కారణంగా టాటా మోటార్స్‌లో అప్‌ట్రెండ్‌ వరుసగా ఆరో సెషన్‌లోనూ కొనసాగింది. ఇవాల అనే బీమా కంపెనీల షేర్లు కూడా బాగా పెరిగాయి. నిఫ్టి  ప్రధాన షేర్లలో టైటాన్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. తరవాతి స్థానాల్లో టాటా మోటార్స్‌, ఐషర్‌ మోటార్స్‌, బజాజ్‌ ఆటో, ఎన్‌టీపీసీ షేర్లు ఒక శాతం లాభంతో క్లోజయ్యాయి. ఇక నష్టాల్లో ముగిసిన నిఫ్టి షేర్లలో హెచ్‌పీసీఎల్‌  2.7 శాతం నష్టంతో టాప్‌లో ఉంది. తరువాతి స్థానాల్లో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, గ్రాసిం, ఇన్‌ఫ్రాటెల్‌, మారుతీ షేర్లు ఉన్నాయి. జీటీఎల్‌ ఇన్‌ఫ్రా పది శాతం లాభంతో క్లోజైంది. ఇవాళ ఫలితాలు ప్రకటించనున్న టీసీఎస్‌ ఓపెనింగ్‌లో ఒక మోస్తరు లాభం పొందినా తరవాత నష్టాల్లోకి జారుకుంది. క్లోజింగ్‌ కల్లా కోలుకుని రూ. 1.6 లాభంతో రూ. 1888 వద్ద ముగిసింది. ఇక రేపు ఫలితాలు వెల్లడించనున్న ఇన్ఫోసిస్‌ కూడా ఓపెనింగ్‌లో రూ.682 దాకా వెళ్ళినా తరవాత రూ. 672కి పడిపోయింది. క్లోజింగ్‌కల్లా ఈ షేర్‌ కూడా కోలుకుని రూ. 3.6 లాభంతో రూ. 680 వద్ద ముగిసింది.