రికార్డు లాభాలతో ముగిసిన నిఫ్టి

రికార్డు లాభాలతో ముగిసిన నిఫ్టి

స్టాక్‌ మార్కెట్‌ వరుసగా అయిదో రోజు లాభాలతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో పాటు దేశీయ ఆర్థిక ఫలితాలు మార్కెట్‌కు మంచి ఊపును ఇచ్చాయి. నిఫ్టి మళ్ళీ 11050పైన ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 128 పాయింట్ల లాభంతో నిఫ్టి 11062 వద్ద క్లోజ్‌ కాగా, సెన్సెక్స్‌ 358 పాయింట్లు లాభపడి 36,975 వద్ద ముగిసింది. నిప్టిలో 45 షేర్లు లాభాలతో ముగిశాయి. అమెరికా, ఆసియా మార్కెట్లకు అనుగుణంగా మన మార్కెట్లు కదలాడాయి. మిడ్‌ సెషన్‌లో మొదలైన యూరో మార్కెట్లు... జర్మనీ డేటా నిరాశాజనకంగా ఉండటంతో నష్టాల్లోకి జారుకుంది. అయినా.. మన మార్కెట్‌ భారీ లాభాల్లో ముగిసింది. అన్ని సూచీలు లాభాల్లో ముగిశాయి. జీ ఎంటర్‌టైన్‌ మెంట్‌ షేర్ ఇవాళ రికార్డు స్థాయి లాభాలతో ముగియడంతో మీడియా సూచీ 4 శాతం పెరిగింది. ఐటీ, మెటల్స్‌ రంగ సూచీలు రెండు శాతం లాభంతో ముగిశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫార్మా, ఆటో రంగ సూచీలు ఒకశాతంపైగా పెరిగాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో టెక్‌ మహీంద్రా 8 శాతం, సిప్లా ఏడు శాతం, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆరున్నర శాతం చొప్పున పెరిగాయి. తరువాతి స్థానాల్లో బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌ ఉన్నాయి. ఇక నిఫ్టి షేర్లలో టాప్‌ లూజర్‌గా అదానీ పోర్ట్స్‌ నిలిచింది. ఫలితాలు నిరాశాజనకంగా ఉండటంతో షేర్‌ మూడు శాతం క్షీణించింది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, టైటాన్‌, యాక్సిస్‌ బ్యాంక్ స్వల్ప నష్టాలతో ముగిశాయి. చురుగ్గా ట్రేడైన ఇతర షేర్లలో డిష్‌ టీవీ 21 శాతం పెరగ్గా, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా 32 శాతం క్షీణించింది.ఆర్‌ పవర్‌, సుజ్లాన్‌లు 8 శాతం చొప్పన పెరిగాయి.