భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయం, అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చలతో పాటు జనవరి డెరివేటివ్స్‌ ముగింపు... ఈ మూడు అంశాల కారణంగా నిఫ్టి ఇవాళ రికార్డు స్థాయిలో 179 పాయింట్ల లాభంతో 10,830 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ ఏకంగా 665 పాయింట్లు పెరిగింది. ఉదయం 10,690 వద్ద ప్రారంభమైన నిఫ్టి పావు గంటలోనే 10,678కి క్షీణించినా.. తరువాత ఊపందుకుంది. రోజంతా అప్‌ట్రెండ్‌ కొనసాగించింది. మధ్యాహ్నం 2.40 గంటల ప్రాంతంలో కొన్ని పాయింట్లు క్షీణించడం వినా.. క్లోజింగ్‌ దాకా నిఫ్టి పెరుగుతూనే ఉంది. 10,838 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన తరువాత 10,830 వద్ద ముగిసింది. నిఫ్టిలో ఏకంగా 40 షేర్లు లాభాలతో ముగిశాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకులు భారీ లాభాలు గడించాయి. చిన్న బ్యాంకులను మార్కెట్‌ పట్టించుకోలేదు. ఒక్క మీడియా షేర్ల సూచీ మాత్రమే ఒక శాతం క్షీణించింది. రియల్‌ ఎస్టేట్‌తో సహా మిగిలిన అన్ని రంగాల సూచీలు ఒక శాతంపైగా పెరిగాయి. వడ్డీ రేట్లను పెంచని ఫెడరల్‌ రిజర్వ్‌.. మున్ముందు కూడా తొందరపడి పెంచమని చెప్పడంతో డాలర్‌ ఇండెక్స్‌ పెరగడం కష్టమే. దీంతో ప్రపంచ మార్కెట్లు ఉరకలెత్తాయి. ఉదయం నుంచి ఆసియా, యూరో మార్కెట్లలో అదే ట్రెండ్‌. నిఫ్టి ప్రధాన షేర్లలో యాక్సిస్‌ బ్యాంక్‌ ఇవాళ నాలుగు శాతం పైగా పెరిగింది. తరువాతి స్థానాల్లో ఉన్న గెయిల్‌, ఇన్ఫోసిస్‌, టైటాన్‌, టాటా మోటార్స్‌ షేర్లు మూడు శాతంపైగా పెరిగాయి. ఇక నష్టాల్లో టాప్‌లో ఉన్న నిఫ్టి షేర్లలో ఎస్‌ బ్యాంక్‌ ముందుంది. ఈ షేర్‌ రెండున్నర శాతం క్షీణించింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు ఒకటి నుంచి రెండు శాతం నష్టంతో ముగిశాయి. దీవాన్‌ హౌసింగ్‌ షేర్‌ ఇవాళ ఏకంగా 16 శాతం నష్టంతో రూ. 134.95కు పడిపోయింది.