నీరవ్‌ మోడీ పాస్‌పోర్ట్‌ మిస్టరీ?

నీరవ్‌ మోడీ పాస్‌పోర్ట్‌ మిస్టరీ?

ఇపుడు ఢిల్లీ పెద్దలను నీరవ్‌ మోడీ పాస్‌పోర్ట్‌ వ్యవహారం కొత్త ఇబ్బందులను తెచ్చి పెడుతోంది.  బ్యాంకులకు వేల కోట్లు టోపి పెట్టిన నీరవ్‌ మోడీ పాస్‌పోర్ట్‌ను రద్దు చేస్తున్నట్లు విదేశాంగ శాఖ ఫిబ్రవరిలోనే ప్రకటించింది. అయితే మార్చి 31వ తేదీ వరకు భారత్‌ పాస్‌పోర్టుపైనే నీరవ్‌ మోడీ ప్రయాణించినట్లు వార్తలు వస్తున్నాయి. బ్రిటన్‌లో కూడా ఆయన ఇదే పాస్‌పోర్ట్‌తో వచ్చారని భారత దర్యాప్తు సంస్థలకు సమాచారం అందింది. దీంతో ఈ వ్యవహారంపై చర్చించేందుకు సీబీఐ, విదేశాంగ శాఖ అధికారులు ఈ వారం సమావేశం కానున్నారు. మరోవైపు నీరవ్‌ మోడీ ఇంగ్లండ్‌ నుంచి బ్రెస్సెయిల్స్‌కు పారిపోయినట్లు తాజా సమాచారం.

నకిలీ పాస్‌పోర్ట్‌?

నీరవ్‌ మోడీ వద్ద భారత్‌కు చెందిన నకిలీ పాస్‌పోర్ట్‌ ఉందని వార్తలు వస్తున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో నకిలీ పాస్‌పోర్ట్‌ పొందడం చాలా ఈజీ అని... నీరవ్‌ కూడా అదే పని చేసి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. అయితే సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు కూడా ఇంటర్‌పోల్‌ సాయం కోరిన తరవాత కూడా నీరవ్‌ అలా స్వేచ్ఛగా విదేశాల్లో తిరుగుతున్నాడనే చర్చ ఇపుడు ఢిల్లీ వర్గాల్లో సాగుతోంది. ఈ విషయమై మాట్లేందుకు ఏ శాఖ కూడా సుముఖంగా లేదు. నీరవ్‌పై రెడ్‌ కార్నర్‌ నోటీస్‌ జారీ చేయాల్సిందిగా ఇంటర్‌పోల్‌ను సీబీఐ  కోరినా.. ఇప్పటి వరకు అటువైపు ఎందుకు స్పందన లేదన్నది సస్పెన్స్‌గా మారింది.

సింగపూర్‌ పాస్‌పోర్ట్‌

వాస్తవానికి నీరవ్‌ మోడీ వద్ద సింగపూర్‌ పాస్‌పోర్ట్‌ ఉందని.. దానిపైనే ఆయన విదేశీ ప్రయాణాలు చేస్తున్నారని సమాచారం. భారత పాస్‌పోర్ట్‌ నకిలీదని చెబుతున్నారు. అయితే బ్రిటన్‌లోకి వచ్చిన నీరవ్‌ ఏ పాస్‌పోర్ట్‌పై వచ్చాడనేది బ్రిటన్‌ అధికారులే చెప్పాల్సి ఉంటుందని ఢిల్లీలో అధికార వర్గాలు అంటున్నారు. ఒకవ్యక్తి ఏ దేశ పాస్‌పోర్టుతో ప్రవేశించాడనేది... అతను పర్యటించిన దేశం మాత్రమే చెప్పగలదని వీరు అంటున్నారు. బ్రిటన్‌కు నీరవ్‌ పలుమార్లు వచ్చి వెళ్ళినట్లు కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల బ్రిటన్‌కు వచ్చిన నీరవ్‌ మోడీ.. రాజకీయ పునరావాసం కోరినట్లు వార్తలు వచ్చాయి. మంగళవారం లేదా బుధవారం అక్కడి నుంచి బ్రెస్సెయిల్స్‌కు ఆయన వెళ్ళినట్లు తెలుస్తోంది.

నీరవ్ మోడీ ఎక్కడున్నాడో తమకు కూడా తెలియదని సీబీఐ చెప్పడం విచిత్రం. నీరవ్‌తోపాటు ఆయన సోదరుడు నిషాల్‌ మోడీపై కూడా రెడ్‌కార్నర్‌ నోటీస్‌ జారీ కోసం సోమవారం కూడా ఇంటర్‌పోల్‌ను సీబీఐ కోరింది. 

ఇపుడు ఏం చేయాలి?

నీరవ్‌ మోడీ సింగపూర్‌ పాస్‌పోర్ట్‌తో ప్రయాణిస్తుంటే ఏం చేయాలనే కోణంలో భారత అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. భారత పాస్‌పోర్టు ఉందనకుని... ఇక్కడి అధికారులు నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ జారీ చేశారు. నీరవ్‌ వద్ద సింగపూర్‌ పాస్‌పోర్ట్‌ ఉంటె..... ఈ వారెంట్‌ ఎందుకూ పనికిరాదు. సింగపూర్‌ ప్రభుత్వంపై భారత్‌ ఒత్తిడి తెస్తే కాని దర్యాప్తు ముందుకు సాగదు. సింగపూర్‌ నుంచి అధికారిక ఆదేశాలు లేకుంటే... ఇంటర్‌పోల్‌ కూడా ఏం చేయలేకపోవచ్చని  తెలుస్తోంది. మొత్తానికి నీరవ్‌ మోడీ విషయంలో కేంద్రం ఏమీ చేయాలేకపోతోందనే ప్రచారాన్ని విపక్షం పెంచుతున్న సమయంలో తాజా పాస్‌పోర్ట్‌ వ్యవహారం మోడీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.