తెలంగాణపై గడ్కరీ వరాల జల్లు 

తెలంగాణపై గడ్కరీ వరాల జల్లు 

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జామ్‌కి చెక్‌ చెప్పేందుకు విస్తృతంగా పనులు జరుగుతున్నాయి. ఈ మధ్య హైదరాబాద్‌లో పలు చోట్ల అండర్ పాస్‌లు ప్రారంభించారు. ఈరోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా రహదారుల విస్తరణ, స్కై వేల పనులకు శంకుస్థాపనలు జరిగాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట్, ఉప్పల్ ఫ్లై ఓవర్లకు అలాగే ఆరాంఘర్-మెదక్ రోడ్ల విస్తరణ పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. రూ.426.52 కోట్ల అంచనాతో హైదరాబాద్ ఓఆర్‌ఆర్ నుంచి మెదక్ సెక్షన్‌లో 62.92 కిలోమీటర్ల నిడివి గల డబుల్‌లేన్ల జాతీయ రహదారికి, హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఆరాంఘర్, శంషాబాద్ సెక్షన్‌లో 10.48 కిలోమీటర్ల నిడివి గల ఆరు వరుసల రహదారికి కూడా శంకుస్థాపనలు చేశారు. అంబర్‌పేటలోని శ్రీరమణ థియేటర్‌ చౌరస్తా నుంచి ఛే నంబర్ కూడలి వరకు, అలాగే, ఉప్పల్ జంక్షన్ నుంచి వరంగల్ రహదారిలోని సీపీఆర్‌ఐ వరకు దాదాపు 6.25 కిలోమీటర్ల ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించనున్నారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ... రాజకీయాలకు అభివృద్ధికి ముడి పెట్టవద్దని.. తెలంగాణా అభివృద్దికి కేంద్రం పూర్తి సహకారం అందించనుందన్నారు. అలాగే తెలంగాణకు కేంద్రమంత్రి వరాల జల్లు కురిపించారు. ముఖ్యంగా జలరవాణ అధ్యయనం కోసం 2 వేల కోట్లు,  ప్రాంతీయ రోడ్ల అభివృద్ధి కోసం 5500 కోట్లు కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే.. అంబర్ పెట్ ఫ్లై ఓవర్ 200 మీటర్ల విస్తరణ కోసం కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బోధన్, మద్దునూర్ 4 లైన్ల కోసం 1000 కోట్లను... ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు జాతీయ రహదారుల విస్తీర్ణం కోసం సీఆర్ఎఫ్ ఫండ్ వెయ్యి కోట్లు అడిగారని.. 750 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకారం తెలిపినట్లు వివరించారు. దేశంలో సంపన్న రాష్ట్రంగా ఎదుగుతూ.. తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఇంకా గోదావరి నుంచి 3000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుందని ఈ జలాలను వాడుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు. తాను తర్వాతి పర్యటనలో కాళేశ్వరం సందర్శిస్తానని ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ వెల్లడించారు.