సంకీర్ణంలో అసంతృప్తి వట్టి మాట...

సంకీర్ణంలో అసంతృప్తి వట్టి మాట...

కర్ణాటకలో ఏర్పడిన కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో... కాంగ్రెస్, జేడీఎస్ మధ్య మంత్రి పదవుల పంపకంలో అసంతృప్తి నెలకొని ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో... కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య స్పందించారు. తమ  సంకీర్ణ ప్రభుత్వంలో పదవుల పంపకంపై తమ ఎమ్మెల్యేల్లో ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేసిన ఆయన... తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీతో కలవబోరన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్ ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటుందని తెలిపారాయన. అసంతృప్తి ఎవరికీ లేదు... అంతా సంతృప్తిగా ఉన్నారని వెల్లడించారు. మినిస్టర్ పదవి రాలేదంటూ కాస్త అసంతృప్తితో ఉన్న నేతలతో చర్చలు జరిపిన సిద్ధరామయ్య... బీజేపీ ఎన్ని ప్రలోభాలకు గురిచేయాలని చూసినా తమ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లబోరన్నారు. 

అయితే జూన్ 6 కేబినెట్ విస్తరణలో తమకు చోటు దక్కకపోవడంతో కొంతమంది బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వేర్వేరు సమావేశాలను నిర్వహించడం చర్చనీయాశంగా మారింది. దీంతో పార్టీ నేతలు బుజ్జగింపులకు దిగాల్సి వచ్చింది. ఇక యడ్యూరప్ప విషయాన్ని ప్రస్తావించిన సిద్ధరామయ్య... కాంగ్రెస్ ఎమ్మెల్యేలను డబ్బు, పదవులతో ప్రలోభపెట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాగా, మరోవైపు జూన్ 14న సంకీర్ణ సర్కార్ తొలి సమన్వయ కమిటీ సమావేశం కానుంది. ఇక సమన్వయ కమిటీకి నాయకత్వం వహిస్తున్న సిద్ధరామయ్య... సంకీర్ణ ప్రభుత్వానికి సున్నితమైన కార్యాచరణను పర్యవేక్షించే బాధ్యతతో అజెండా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.