రివ్యూ: ఎన్టీఆర్ - కథానాయకుడు

రివ్యూ: ఎన్టీఆర్ - కథానాయకుడు

నటీనటులు : బాలకృష్ణ, విద్యాబాలన్, సుమంత్, కళ్యాణ్ రామ్, నరేష్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ   

సంగీతం :  ఎం.ఎం.కీరవాణి 

సినిమాటోగ్రఫి :  జ్ఞానశేఖర్ విఎస్ 

నిర్మాత : నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి

దర్శకత్వం : క్రిష్ 

తెలుగు ప్రజలు కీర్తిని దేశ నలుమూలలకు వ్యాప్తిపజేసిన యుగ పురుషుడు నందమూరి తారకరామారావుగారి జీవితం ఆధారంగా ఆయన కుమారుడు, నటుడు నందమూరి బాలకృష్ణ రూపొందించిన చిత్రం 'ఎన్టీఆర్ - కథానాయకుడు'.  క్రిష్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో బాలయ్యే స్వయంగా తన తండ్రి ఎన్టీఆర్ పాత్రను ధరించాడు.  మరి ఆ మహనీయుని సినీ, వ్యక్తిగత జీవితాన్ని తెరపై ఆవిష్కరించే ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలమైందో ఇప్పుడు చూద్దాం.. 

కథ : 

ఎన్టీఆర్ సినీ జీవితం గురించి తెలుగు ప్రేక్షకులకు చాలానే తెలుసు.  ఆయన సినిమాల్లోకి ఎలా వచ్చారు, ఎలా ఎదిగారు అనేవి మనం చూశాం, విన్నాం.  కానీ వ్యక్తిగత జీవితం.. ముఖ్యంగా సతీమణి బసవతారంతో ఆయన అనుబంధం ఎంత గొప్పది... అనేది ఈ చిత్రంలో చూపారు..  ఉద్యోగం మానేసి సినిమాల్లోకి వెళ్ళాలనే తపన ఎన్టీఆర్లో ఎలా, ఎందుకు కలిగింది?, పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదగడానికి ఆయన ఎంత కష్టపడ్డారు వంటి అంశాలను కూడా ఇందులో చూపారు.  నటుడిగా పరిపూర్ణం అయ్యాక తనని గొప్పవాణ్ణి చేసిన జనం కోసం... ఆయన రాజకీయ రంగంలోకి రావాలనుకుని, తెలుగు దేశం పార్టీని ప్రకటించడం అనే ముఖ్య ఘట్టం కూడా ఇందులో ఉంది.    

విశ్లేషణ :  

మహా సముద్రంలాంటి ఎన్టీఆర్ సినీ జీవితాన్ని తెరపై చూపడమంటే అంటే మాటలు కాదు.  తగినంత విషయ సమాచారాన్ని సేకరించి, అనేక పాత్రలు నుండి ముఖ్యమైన వాటిని వడకట్టి, వాటికి జీవం పోయగల సమర్థులైన నటీనటుల్ని ఎంచుకుని, అందరికీ తెలిసిన పాత, తెలియని కొత్త విషయాలను నాటకీయంగా అంతే సహజంగా తెరపై ఆవిష్కరించాలి. ఆ పని అద్భుతంగా చేసి చూపించారు క్రిష్.  బాలయ్య పడిన కష్టం గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి.  ఎన్టీఆర్ సినీ జీవితంలో మరుపురానివిగా గుర్తుండిపోయిన తోటరాముడు, శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు వంటి అనేక పాత్రల్ని బాలయ్య ధరించి ఒక్కో పాత్రలో ఒక్కో వేరియేషన్ చూపించిన తీరు ఔరా అనేలా చేస్తుంది.  ఎన్టీఆర్, బసవతారకం నడుమ ఉండే అనుబంధాన్ని, ఏఎన్నార్ - ఎన్టీఆర్ మైత్రీ బంధాన్ని ఎంతో ఉన్నతంగా చూపారు.  సినిమా మొత్తానికే అవే హైలెట్.  అలాగే దివిసీమ ఉప్పెన సన్నివేశాలు, సినిమాల నుండి రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు ఎన్టీఆర్ పడిన అంతర్మథనం, త్యాగాలకు సిద్ధపడిన తీరు భావోద్వేగానికి గురిచేస్తాయి.  ఒక్క మాటలో చెప్పాలంటే తన తండ్రి జీవితాన్ని వెండి తెరపై చూపాలనే బాలయ్య ఎన్నో ఏళ్ల కల ఈ సినిమాతో నెరవేరిందని అనొచ్చు. 

నటీనటుల పనితీరు : 

అన్ని పాత్రలకు సరైన నటీనటుల్ని ఎంచుకోవడంలో సక్సెస్ అయిన క్రిష్ వారిచేత నటింపజేయటంలోనూ   విజయం సాధించారు.  పైన చెప్పుకున్నట్టు ఎన్టీఆర్ పాత్రలో ప్రతి దశలోనూ బాలయ్య మెప్పించగా... బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటన కొన్నాళ్ల పాటు గుర్తుండిపోతుంది.  ఇక ఏఎన్నార్ పాత్రలో సుమంత్ తాతను తలపించగా త్రివిక్రమరావు పాత్రలో దగ్గుబాటి రాజా బాగా నటించారు.  చిన్న చిన్న సన్నివేశాల్లో కనిపించే ప్రతి పాత్రలోనూ నటీ నటులంతా మెప్పించారు.  

సాంకేతిక వర్గం పనితీరు : 

ముందుగా.... ఇలాంటి క్లిష్టమైన సినిమాను ముందుండి నడిపించిన క్రిష్ ప్రతిభను అభినందించాలి.  వాస్తవ జీవితాన్ని బోర్ కొట్టకుండా నాటకీయ రీతిలో తెరపై చూపిన ఆయన తీరు, సన్నివేశాలను రాసుకున్న విధానం, కొద్దిగా నిదానంగా ఉన్నా సరే కథనంలో ఎమోషన్ క్యారీ చేయడం బాగున్నాయి.  కీరవాణి నేపథ్య సంగీతం, పాటల సంగీతం సినిమాకు మరొక ప్లస్.  ఇక జ్ఞానశేఖర్ విఎస్ సినిమాటోగ్రఫీ అందంగా, చక్కగా కుదిరిపోయింది.  సాయి మాధవ్ బుర్రా డైలాగుల ఆకట్టుకున్నాయి.  ప్రతి విభాగం అకింతభావంతో పనిచేయడంతో సాంకేతికంగా సినిమా ఉన్నతంగా నిలబడింది. 

పాజిటివ్ పాయింట్స్ : 

బాలక్రిష్ణ, విద్యాబాలన్ నటన 

నటుడిగా ఎన్టీఆర్ జర్నీ 

డైలాగులు 

ఎన్టీఆర్, ఏఎన్నార్ స్నేహ బంధం 

భావోద్వేగపూరిత సన్నివేశాలు 

నెగెటివ్ పాయింట్స్ : 

నెమ్మదిగా సాగిన కథనం 

నిడివి ఎక్కువగా ఉండటం

చివరిగా : బాలయ్య కల నెరవేరింది