బాల్క సుమన్ పై మండిపడ్డ ఓదేలు

బాల్క సుమన్ పై మండిపడ్డ ఓదేలు

ఎంపీ బాల్క సుమన్ పై తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం ఇందూరు ప్రచారంలో ఆత్మహత్యకు పాల్పడ్డ తన అనుచరుడు రేగుంట గట్టయ్యను కాసేపటి క్రితం ఆయన పరామర్శించారు. తీవ్ర గాయాలతో వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్న గట్టయ్యను పరామర్శించిన అనంతరం ఓదేలు మీడియాతో మాట్లాడారు. నా వర్గానికి  సంబంధించిన వారు దాడికి పాల్పడలేదని స్పష్టం చేశారు. కేవలం స్ధానికుడికి టికెట్ కేటాయించడంతో ప్రజలు ఆగ్రహాంతోనే దాడికి పాల్పడ్డారని, నాకు దాడి చేయించే అవసరం లేదని నల్లాల ఓదేలు తెలిపారు. తనపై హత్యప్రయత్నం జరిగిందని ఆరోపించిన బాల్క సుమన్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బాల్క సుమన్ చరిత్ర మొత్తం కేసీఆర్ ముందు పెడతానని హెచ్చరించారు. నన్ను మానసిక క్షోభకు గురి చేసేందుకే కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఈరోజు నియోజకవర్గంలోని ఇందారం గ్రామంలో పర్యటించేందుకు వచ్చిన బాల్క సుమన్‌ను ఓదేలు వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఓదేలు అనుచరుడు రేగుంట గట్టయ్య కిరోసిన్‌ పోసుకుని ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మంటలు ఆర్పేందుకు యత్నించేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఈ ఘటనలో గాయాలపాలయ్యారు. చివరికి పోలీసులు మంటలు ఆర్పి గంటయ్యను ఆస్పత్రికి తరలించారు. చెన్నూరు నియోజకవర్గ అభ్యర్థిగా బాల్క సుమన్‌ను కేసీఆర్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీన్ని తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు తీవ్రంగా ఖండించారు. తనకు చెన్నూరు టిక్కెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ నిన్న ఆయన స్వీయ గృహ నిర్బంధం విధించుకున్నారు. దీంతో ఓదేలు వర్గం బాల్క సుమన్‌పై ఆగ్రహంతో ఉన్నారు.