దాచేపల్లిలో మరో దారుణం

దాచేపల్లిలో మరో దారుణం

గుంటూరు జిల్లా దాచేపల్లిలో మైనర్‌ బాలికపై వృద్ధుడి అత్యాచార ఘటన మరువక ముందే మరో ఘోరం వెలుగుచూసింది. 12 ఏళ్ల బాలికపై దాచేపల్లి మండల కోఆప్షన్‌ సభ్యుడు మహబూబ్‌ వలీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక తల్లదండ్రులు దాచేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం గురజాల ఆస్పత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు మూడు నెలలు గర్భవతిగా తేల్చారు. మండలపరిషత్‌లో కోఆప్షన్‌ సభ్యుడిగా ఉన్న మహబూబ్ వలీ స్థానిక జలగల బజారులో వ్యాపారం చేస్తుంటాడు. బాధిత బాలిక తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో ఆమె 7వ తరగతితో చదువు మానేసింది. బాలిక తండ్రి మట్టికుండలు తయారుచేస్తూ జీవనం సాగిస్తుంటాడు. బాధిత బాలిక తన అక్కతో పాటు మాహబూబ్ వలి వద్ద కూలి పనులు చేస్తుంటుంది. దీంతో ఆ బాలికను లోబర్చుకుని గత కొన్నినెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ విషయం బయటకు చెప్తే.. చంపేస్తానని బెదిరించడంతో ఆమె ఎవరికీ చెప్పలేదు. 

బాలిక ఈ మధ్య మూడు రోజులుగా కడుపు నొప్పి వస్తుండటంతో అక్క ఆసుపత్రికి వెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించగా గర్భవతి అని తేలింది. దీంతో విస్తుపోయిన బాలిక తండ్రి తన బిడ్డకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్న తీరు చూసేవారిని కంటతడి పెట్టిస్తోంది.