రోడ్డుమీద గుంతలకు మొనగాడితడే

రోడ్డుమీద గుంతలకు మొనగాడితడే

హైదరాబాద్ రోడ్ల మీద వెహికల్ డ్రైవ్ చేయాలంటే చెప్పలేని చిరాకు. రోడ్ల మీద గుంతలు అంత దారుణంగా ఉంటాయి మరి. మున్సిపల్ అధికారులను తిట్టుకుంటూ వెళ్తారే తప్ప అందుకు తమ వంతుగా ఏం చేస్తామని బహుశా ఎవరూ ఆలోచించరు. కానీ ముంబైలో దాదారావు బిల్హోరే అనే ఔత్సాహికుడు.. కనిపించిన గుంతనల్లా వదిలిపెట్టకుండా పూడ్చేస్తాడు. 2015 నుంచి దాదారావు ఈ పని చేస్తున్నాడు. ఈ మూడేళ్లలో ఆయన సొంత చేతులతోనే 600 గుంతలు పూడ్చేశాడు. దీంతో ఈయన పేరు మంబైలో పాపులరైపోయింది. 

గుంతలు పూడ్చాలన్న ఆలోచన ఎందుకొచ్చిందంటే..
2015లో దాదారావు 16 ఏళ్ల కొడుకు ప్రకాశ్ బిల్హోరే.. గుంతల కారణంగానే చనిపోయాడు. బైక్ మీద మిత్రుడితో కలిసి వెళ్తుంటే.. అనుకోకుండా బండి గుంతలో పడి అంతెత్తుకు ఎగిరి పడ్డారు. ఈ ప్రమాదంలో ప్రకాశ్ తలకు బలమైన గాయాలై చనిపోయాడు. ఇలాంటి పరిస్థితి ఎవరి కొడుకులకూ రాకూడదని భావించిన దాదారావు గుంతలు పూడ్చే పనికి స్వచ్ఛందంగా పూనుకున్నాడు. 48 ఏళ్ల దాదారావు కూరగాయలు అమ్మి పొట్టు పోసుకుంటాడు. 

ముంబైలో గతేడాది 3597 మంది కేవలం గుంతలవల్లనే ప్రాణాలు కోల్పోయారని రికార్డులు  చెబుతున్నాయి. అంటే రోజుకు పది మంది అన్నమాట.