కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా: చాందీ

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా: చాందీ

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాందీ అన్నారు. ఈ రోజు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... రాజకీయ పార్టీల దుష్ప్రచారం వల్లే కాంగ్రెస్ నిందలు మోస్తుందని తెలిపారు. ఆంద్ర ప్రజల మనస్సులో కాంగ్రెస్ కు ప్రత్యేక స్థానం  ఉందన్నారు. విభజన చేసినా.. కొన్ని ప్యాకేజీలు ఆంధ్రప్రదేశ్ కు వరాలుగా మారేవని అభిప్రాయపడ్డారు. ఏపీలో గడచిన నాలుగు సంవత్సరాలుగా జరిగిన మోసం గురించి ప్రజలకు వివరించాలని.. జరిగిన అన్యాయం ఎవరి వలన జరిందో ప్రజలకు వివరించే విషయంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతుందని ఉమెన్ చాందీ అన్నారు.

2014 తర్వాత అధికారంలోకి వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేయడం దురదృష్టంకరం అని ఉమెన్ చాందీ అన్నారు. మూడున్నర సంవత్సరాలు ఏన్డిఏతో అంటకాగిన చంద్రబాబు బృందం కేంద్ర మంత్రి పదవులు అనుభవించారని.. ఇప్పుడు అన్యాయం జరిగిందంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టం చేసారు. ఇది ఎన్నికల కోసం ఇచ్చే హామీ కాదు.. చట్టసభలో ఇచ్చిన మాట అని తెలిపారు. పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బహిరంగంగానే ప్రకటించారని ఉమెన్ చాందీ గుర్తుచేశారు. రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా  పుంజుకుంటుందన్నారు.

బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు పేద ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఉమెన్ చాందీ పేర్కొన్నారు. ఏపీ వ్యవహారాలు నాకు కొత్తకాదు.. రాజీవ్ గాందీ హయాంలో ఏపీ కాంగ్రెస్ లో పనిచేసాను.. ఇప్పుడు రాహుల్ సారథ్యంలో ఏపీ కాంగ్రెస్ కు పనిచేస్తున్నాను, అయితే ఇప్పుడు మరింత భాద్యతగా  పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల ముందు పొత్తుల గురించి ఆలోచన లేదు.. 2019లో కాంగ్రెస్ ను గౌరవప్రద స్థానంలో నిలపడమే ప్రస్తుత ముందున్న లక్ష్యం. ఎన్నికల తర్వాత ప్రజా నిర్ణయం ఆశీర్వాదంను బట్టి పొత్తులు విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఉమెన్ చాందీ తెలిపారు.