మోడీకి 50 రోజుల గడువు గుర్తుచేసిన విపక్షాలు

మోడీకి 50 రోజుల గడువు గుర్తుచేసిన విపక్షాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివాదాస్పద పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించి నేటికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతిపక్షాలన్నీ ఏక కంఠంతో ప్రధానిని టార్గెట్ చేశాయి. లెఫ్ట్ నేత సీతారామ్ ఏచూరి, కాంగ్రెస్ నేతలు శశిథరూర్, మనీష్ తివారీ, ఇతర పార్టీల నేతలు ప్రధాని మోడీ కోరిన 50 రోజుల గడువుని గుర్తు చేశారు. హఠాత్తుగా తీసుకొన్న నిర్ణయంతో దేశవాసులనను తీవ్రంగా వేధించిన నగదు కొరత, ఇతర సమస్యలను 50 రోజుల్లో తీరుస్తానని చెప్పిన మాటేమైందని ప్రశ్నించారు. మోడీ చెప్పిన మాటల వీడియో క్లిప్ ను పోస్ట్ చేస్తూ ఏచూరి ఆయన తను చెప్పిన మాట మరచిపోయారు. గుర్తు చేయాల్సిన బాధ్యత మనందరిది అని ట్వీట్ చేశారు. 

మనీష్ తివారీ ఆనాటి వార్తాపత్రిక క్లిప్ పోస్ట్ చేస్తూ 50 రోజులు కాదు.. 730 రోజులు గడిచినా పరిస్థితులేం మారలేదు. ఆనాటి రాత్రి మాదిరిగా ఇవాళ 8 గంటలకు టీవీ ద్వారా జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆయన సహచరుడు, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ రీట్వీట్ చేస్తూ 50 రోజుల సమయం ఇచ్చాము కానీ ఆ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ తగలబడిపోయిందని కామెంట్ పెట్టారు.

నవంబర్ 8, 2016న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ.1,000, రూ.500 నోట్లు తక్షణమే రద్దు చేస్తున్నట్టు ప్రకటించి సంచలన సృష్టించారు. ఈ నిర్ణయంతో నగదు కొరత ఏర్పడి దేశంలో అరాచక పరిస్థితి తలెత్తిందని విపక్షాలు విమర్శించాయి. చిన్న వ్యాపారాలు దెబ్బ తిన్నాయని, పాత నోట్లకు కొత్త కరెన్సీ మార్చుకొనే క్యూలలో 100 మందికి పైగా చనిపోయారని ఆరోపించాయి.