లీటర్ నీళ్లపై రూ.1 పన్ను

లీటర్ నీళ్లపై రూ.1 పన్ను

లీటర్ నీళ్లపై రూ.1 పన్ను విధించింది పాకిస్థాన్ సుప్రీంకోర్ట్. మినరల్ వాటర్, ఇతర శీతల పానీయాలు తయారు చేసేందుకు కంపెనీలు తాము తోడిన ప్రతి లీటర్ నీటికి రూ.1 పన్నుగా చెల్లించాలని శనివారం పాక్ సుప్రీంకోర్ట్ ఆదేశించింది. ఉచితంగా కంపెనీలు నీటిని తోడేస్తున్నాయనే సుమోటో కేసులో కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఈ నీటి నాణ్యత, మనుషులు తాగవచ్చా అనే అంశాలపై కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. 

ఈ డబ్బుని డైమర్-భాషా, మొహ్మంద్ డ్యాముల నిర్మాణానికి వినియోగించనున్నారు. స్థానిక ప్రభుత్వాలు, ఇస్లామాబాద్ కేపిటల్ టెర్రిటరీ పాలనా యంత్రాంగం ఇందుకోసం ప్రత్యేకమైన ఖాతాలు ఏర్పాటు చేసి నీటి చార్జీలు వసూలు చేయాలని చీఫ్ జస్టిస్ సాకిబ్ నిసార్ సూచించారు. ఆ మొత్తాలను ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన డ్యామ్స్ ఫండ్ లో జమ చేయాలి. ఈ నిధులను ఎట్టి పరిస్థితుల్లోను ఆనకట్టల నిర్మాణం, నీటి సంబంధిత పనులకి తప్ప వేరే ఇతర కార్యక్రమానికి ఉపయోగించరాదని స్పష్టం చేసింది.

డ్యాములు నిర్మించిన తర్వాత స్థానిక ప్రభుత్వాలు ఈ ఖాతాలలోని డబ్బు తమ అవసరాలకు వాడుకోవచ్చని తీర్పు చెప్పింది. ప్రొఫెసర్ మొహమ్మద్ ఎహ్సాన్ సిద్ధిఖీ అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీని కోర్టు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో స్థానిక ప్రభుత్వాల సెక్రటరీలు, ప్రాంతీయ పర్యావరణ సంరక్షణ ఏజెన్సీల డైరెక్టర్ జనరల్స్, ఇతర ప్రజాసంఘాల ప్రతినిధులు ఉంటారు.