న్యూజిలాండ్ బౌలర్ హ్యాట్రిక్

న్యూజిలాండ్ బౌలర్ హ్యాట్రిక్

న్యూజిలాండ్ స్టార్ పేస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ హ్యాట్రిక్ సాధించాడు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో బౌల్ట్ హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. దీంతో వన్డేలో హ్యాట్రిక్ సాధించిన మూడో కివీస్ బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇంతకుముందు ఈ జాబితాలో డాన్నీ మోర్రిసన్(1994లో ఇండియాపై), షేన్ బాండ్(2007లో ఆస్ట్రేలియాపై) లు ఉన్నారు. పాక్ స్కోరు 8 పరుగుల వద్ద ఉన్నప్పుడు బౌల్ట్ హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. మూడో ఓవర్ రెండో బంతికి పాక్ ఓపెనర్ ఫకర్ జమాన్ (1)ను బౌల్డ్ చేసాడు. మూడో బంతికి బాబర్ ఆజం (0)ను క్యాచ్ రూపంలో పెవిలియన్ చేర్చాడు. ఇక నాలుగో బంతికి మహమ్మద్ హఫీజ్(0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. రాస్ టేలర్ (80), టామ్ లాతమ్ (68) పరుగులు చేశారు. అనంతరం 267 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ను ట్రెంట్ బౌల్ట్ హడలెత్తించాడు. దీంతో పాక్ స్కోరు 8 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే పాక్ బ్యాట్స్‌మెన్ పోరాడడంతో 47.2 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌట్ అయింది. హ్యాట్రిక్ సాధించిన బౌల్ట్ కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌' దక్కింది.