ప్రేమలో గెలిచి.. పెళ్లితో ఒక్కటైన ప్రేమికులు

ప్రేమలో గెలిచి.. పెళ్లితో ఒక్కటైన ప్రేమికులు

ప్రేమ ముందు పెద్దల పంతాలు, పట్టింపులు ఓడిపోయాయ్. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేక ఓ జంట పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకోబోయారు. దాంతో పెద్దల మనస్సు కరిగి వారి పెళ్లికి  అంగీకరించారు. వికారాబాద్ లో మెకానిక్ గా పనిచేసే మహ్మద్ నవాజ్, అత్తిలి గ్రామానికి చెందిన రేష్మా ప్రేమించుకున్నారు. నవాజ్ అన్నయ్యకు రేష్మా అక్కయ్యతో గతంలో వివాహం జరిగింది. అక్క ఇంటికి తరచూ వచ్చే రేష్మాతో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. విషయం ఇంట్లో తెలియడంతో.. అక్కను ఆ ఇంట్లోనే ఇచ్చాం మళ్లీ అదే ఇంట్లో ఎందుకు? వేరే సంబంధం చూస్తామని రేష్మాకి అభ్యంతరం చెప్పారు ఆమె తల్లిదండ్రులు.

ప్రేమించిన ప్రియుడు దూరమవుతున్నాడని మనస్థాపం చెందిన రేష్మా ఈనెల 8వ తేదీన తమ ఇంట్లోని పురుగుల మందు తాగింది. గమనించిన ఆమె కుటుంబీకులు వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె తాగిన పురుగుల మందును డబ్బాతో సహా తెచ్చి వైద్యులకు చూపించారు. తాను చూస్తానంటూ ఆ పురుగుల మందు డబ్బాను చేతికందుకుని ప్రియురాలు మిగిల్చిన పురుగులమందంతా తాగేశాడు నవాజ్. ప్రేమికులిద్దర్నీ ఆసుపత్రిలో చికిత్స చేయించి.. మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నాలుగు రోజుల తర్వాత స్పృహలోకి వచ్చారు ఇద్దరు. మనస్సు మార్చుకున్న ఇరుపక్షాల పెద్దలు ఆసుపత్రిలోనే పెళ్లి జరిపించారు. వరుడికి కట్నకానుకలు కూడా ఇచ్చారు. ఇద్దరు ఒక్కటవ్వడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండాపోయింది.