ఉర్జీత్‌....ఏటీఎంలో క్యాష్‌ ఎక్కడ?

ఉర్జీత్‌....ఏటీఎంలో క్యాష్‌ ఎక్కడ?

నోట్ల రద్దు జరిగి 18 నెలలు దాటినా ఇంకా నోట్ల కొరత ఎందుకు ఉందని ఆర్థికశాఖపై ఏర్పాటైన స్థాయీ సంఘం ఆర్‌బీఐ గవర్నర్‌ను నిలదీసింది. గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ ఇవాళ స్థాయీ సంఘం ఎదుట హాజరయ్యారు. దాదాపు మూడు గంటల పాటు గవర్నర్‌ను స్థాయి సంఘం సభ్యులు ప్రశ్నించారు. ఇవాళ్టి స్థాయి సంఘం సమావేశానికి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కూడా హాజరయ్యారు. ఈ భేటీలో పలు కీలక ప్రశ్నలతో గవర్నర్‌ను ఎంపీలు ఉక్కిరి బిక్కిరి చేశారు. ప్రధాన నోట్ల కొరతపై ప్రశ్నించారు. తరవాత ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నానాటికి పెరిగిపోతున్న కుంభకోణాల గురించి నిలదీశారు. ముఖ్యంగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, నీరవ్‌ మోడీ, మెహుల్‌ చోక్కీ అంశాలపై కూడా విపక్ష పార్టీల ఎంపీలు ఉర్జిత్‌కు పలు ప్రశ్నలు వేశారు. నోట్ల చెలామణి తగ్గించేందుకే నోట్ల రద్దు అని చెప్పారని, కాని ఇపుడు జనం దగ్గరే అత్యధిక మొత్తం చెలామణిలో ఎందుకు ఉందని నిలదీశారు.

అంతులేని స్కాములు

 2018 ఆర్థిక సంవత్సరంలో 5,904 బ్యాంకు మోసాలు జరిగాయని, వీటి విలువ రూ.32,361 కోట్లని గవర్నర్‌ రాతపూర్వకంగా కమిటీకి తెలిపారు. 2016లో రూ. 19,697 కోట్ల విలువైన బ్యాంకు మోసాలు జరగ్గా 2017లో రూ. 23,933 కోట్లకు చేరినట్లు ఉర్జిత్‌ పటేల్‌ తెలిపారు. అంటే మూడేళ్ళలోనే ఈ స్కామ్‌ల విలువ రూ. 73,000 కోట్లకు దాటిందని తెలిపారు. అయితే బ్యాంకు కుంభకోణాలకు ఆస్కారం లేకుండా ఆర్‌బీఐ తనవంతు ప్రయత్నాలు చేస్తోందన్నారు. అయితే పీఎస్‌యూ బ్యాంకుల పూర్తి నియంత్రణ తమ చేతుల్లో లేదని ఉర్జిత్‌ కమిటీ సభ్యులకు తెలిపారు. బ్యాంకు పెద్దల నియామకం నుంచి ఇతర కీలక వ్యవహారాల్లో తమ పాత్ర లేదంటూ అలాంటి పది అంశాలను కమిటీ దృష్టికి తెచ్చారు. బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టంలో మార్పులు తెచ్చి... ఆర్‌బీఐకి మరిన్ని అధికారులు దఖలు పర్చాలని ఉర్జిత్‌ సింగ్‌ అన్నారు.