కాలినడకన తిరుమలకు పవన్ 

కాలినడకన తిరుమలకు పవన్ 

జనసేనాని పవన్ కల్యాణ్ తిరుమల పర్యటనలో ఉన్నారు. కాలినడకన అలిపిరి నుండి తిరుమలకు చేరుకున్న పవన్ ఈరోజు శ్రీవారిని దర్శించుకోనున్నారు. అర్థరాత్రి తిరుమలకు చేరుకున్న పవన్, మూడు రోజుల పాటు తిరుమలలోనే బస చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యేక ప్రవేశం దర్శనం క్యూలైన్ లో దర్శనానికి వెళ్లనున్నారు పవన్. ఎంతో కాలంగా ఆయన తిరుమలలో మూడు నిద్రలు చేయాలని భావిస్తూ వచ్చారని.. ఈ మేరకు ఆయనకో మొక్కు ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం పర్యటించాలన్న నిర్ణయం తీసుకున్న ఆయన.. అంతకన్నా ముందు మొక్కు తీర్చుకోవాలని భావించారని జనసేన వర్గాలు వెల్లడించాయి.
తిరుమలలో ఉండే మూడు రోజుల్లో ఇక్కడ ఉన్న తీర్థాలను, ఇతర దేవాలయాలను దర్శించుకోవడంతో పాటు భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులను గురించి ఆయన స్వయంగా తెలుసుకుంటారని పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. మూడు రోజుల తరువాత ఆయన నేరుగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వెళ్లి అక్కడి నుంచి తన యాత్రను ప్రారంభిస్తారని తెలుస్తుంది. ఇచ్ఛాపురం నుంచి ఆయన బస్సు యాత్ర ప్రారంభమై రాష్ట్రమంతా జరుగుతుందని తెలిపారు. ఈ మూడు రోజులలో బస్సు యాత్రకు సంబంధించిన షెడ్యూల్ ను పవన్ ప్రకటించనున్నారు.