పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2 తగ్గించిన ఏపీ...

పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2 తగ్గించిన ఏపీ...

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రెండు రూపాయలు తగ్గిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రకటించారు. రేపటి ఉదయం నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయని తెలిపారు. ఈ తగ్గింపుతో ప్రభుత్వానికి రూ.1120 కోట్ల ఆదాయం తగ్గుతుందన్నారు. బీజేపీ వచ్చాక ఎప్పుడూ లేనంతగా ఇష్టానుసారంగా రేట్లు పెంచేస్తున్నారని మండిపడ్డారు. దాదాపుగా 23 లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజల మీద కేంద్రం భారం వేసిందన్నారు. పెరుగుతున్న రేట్లు చూసి ప్రజలకు ఆవేదనతో ఉన్నారన్నారు.  

'కేంద్ర చమురు సంస్థలు రోజురోజుకూ పెట్రో ధరలను పెంచడం పట్ల దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఈ రోజు ప్రతిపక్షాలు నిర్వహిస్తున్న బంద్‌కు ప్రజల నుంచి వచ్చిన విశేష స్పందనే దీనికి నిదర్శనం. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, బాధ్యతారహిత విధానాలు ప్రజలకు భారంగా మారాయి. ప్రజలను తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ ధరలను తగ్గించడానికి కేంద్రం నాలుగున్నరేళ్లుగా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గర్హనీయం' అని బాబు అన్నారు. 

అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోలియం ధరలు పెరగడం, రాష్ట్రాలు వ్యాట్‌ను పెంచడం వల్ల డీజిల్‌, పెట్రోలు ధరలు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేయడం సరికాదన్నారు. 2014లో క్రూడాయిల్‌ ధర  బ్యారల్‌కు 105. 52 డాలర్లు ఉండగా, ఇవాళ క్రూడాయిల్‌ ధర కేవలం 72.23  డాలర్లుగా ఉందన్నారు.  2014లో లీటరు పెట్రోలు రూ. 49.60 ఉంటే, నేడు పెట్రోల్‌ ధర రూ. 86.71కి పెరిగిందన్నారు.  గతంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర తగ్గినప్పటికీ మన దేశంలో కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరలు తగ్గించకుండా, అదనపు పన్నులు, సెస్‌ రూపంలో ధరలు పెంచిందని బాబు గుర్తు చేశారు.