'ఎందుకు కాంగ్రెస్ జెండా మోయాలి..!?'

'ఎందుకు కాంగ్రెస్ జెండా మోయాలి..!?'

పార్టీలో సామాజిక న్యాయం జరగనప్పుడు ఎందుకు కాంగ్రెస్ జెండాలు మోయాలనే పరిస్థితి పార్టీ నేతలు తీసుకువస్తున్నారని మండిపడ్డారు పినమాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి అసమర్థులకు ఇచ్చారని విమర్శించిన ఆయన.. ఇప్పటికే పార్టీ పదవులకు రాజీనామా చేస్తూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖరాశారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన రేగా కాంతారావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష పదవిని అసమర్ధులకు ప్రకటించడంపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ ఉండి నడిపించేటువంటి నాయకత్వం లేదన్న ఆయన.. ఉమ్మడి జిల్లా పార్లమెంట్ ఎన్నికలకు బాధ్యత వహించాల్సిన కీలకమైన జిల్లా అధ్యక్ష పదవి యువతకు ప్రాధాన్యత ఇవ్వకుండా పార్టీలు మారినవారికి, చేతకానివారికి కట్టపెట్టడం దౌర్భాగ్యమైన విషయం అన్నారు. 2014లో టికెట్ ఇవ్వకపోయినా పార్టీ కోసం పాటు పడుతుంటే జిల్లా కాంగ్రెస్ పదవి ఇచ్చి గంటలో పీకేశారు.. అయినా, కాంగ్రెస్ కోసం దృఢ నిశ్చయంతో పనిచేస్తూ వచ్చానన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో రాహుల్ నియమించిన స్పెషల్ పదవుల్లో చురుగ్గాపని చేస్తే.. జిల్లా పదవులు ఎంపిక జరిగేటప్పుడు నన్ను సంప్రదించకుండా 70 ఏళ్ల వ్యక్తికి ఇవ్వడం దారుణమైన విషయమన్నారు. నాలుగు సార్లు పార్టీలు మారిన వ్యక్తి కింద ఏ విధంగా పనిచేయాలని ప్రశ్నించిన పినపాక ఎమ్మెల్యే... 2014లో కేసీఆర్ బీఫామ్ పంపించారు. అయినా తాను కాంగ్రెస్ పార్టీని వీడలేదని గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పై కేంద్ర నాయకులు దృష్టి పెట్టాలి.. లేకపోతే, తమిళనాడు పరిస్థితి తెలంగాణలో ఏర్పడుందని ఆవేదన వ్యక్తం చేశారు రేగా కాంతారావు.