బాబు ఐరాస ప్రసంగంను అడ్డుకునేందుకే కుట్ర

బాబు ఐరాస ప్రసంగంను అడ్డుకునేందుకే కుట్ర

ఐక్యరాజ్యసమితి సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరుకావడం మోడీకి ఇష్టంలేకనే ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. ఈ రోజు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ కుట్ర రాజకీయాలకు ఇది ఒక నిదర్శనం. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అంతా కలిసి ఈ కుట్ర చేశారని మండిపడ్డారు. కేసు లేదని మోసం చేసి ఇప్పుడు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ఎంత వరకు సమంజసం? అని ప్రశ్నించారు. వైసీపీ అధినేత జగన్ తో కుమ్మక్కై ఈ రోజు మోడీ ఆడిన డ్రామానే బాబ్లీ కేస్ అని అన్నారు. 2019 ఎన్నికల్లో మోడీకి ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన పేర్కొన్నారు. బాబ్లీ కేసులో కేసీఆర్ కుట్ర కూడా దాగి ఉందన్నారు. ఎన్ని కుట్రలు చేసినా వారి ఆటలు సాగవు అని కేశినేని నాని తెలిపారు. రాజ్యాంగ బద్ధ సంస్థలను కూడా మోడీ వాడుకుంటున్నారు. బాబు ఎదుగుదల.. ఏపీ అభివృద్ధి చూసి ఓర్వలేకనే మోడీ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారన్నారు. 

సెప్టెంబర్  24న న్యూయార్క్‌లో జరగనున్న సదస్సులో చంద్రబాబు ఫైనాన్సింగ్ సస్టైనబుల్ అగ్రికల్చర్-గ్లోబల్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ అంశంపై ప్రసంగించనున్నారు. వ్యవసాయ రంగంలో సీఎం చంద్రబాబు రాష్ట్రానికి చేస్తున్న కృషిని గుర్తించిన ఐరాస చంద్రబాబుని ఆహ్వానించింది.