రికార్డుల నుంచి ప్రధాని వ్యాఖ్యలు తొలగింపు

రికార్డుల నుంచి ప్రధాని వ్యాఖ్యలు  తొలగింపు

ప్రధాని మోడీ రాజ్యసభలో విపక్షనేత హరిప్రసాద్ పై చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. పార్లమెంట్‌లో ప్రధాని మాట్లాడిన అంశం నుంచి కొన్ని పదాలను తొలగించడం ఇదే మొదటిసారి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి కోసం జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో విపక్ష అభ్యర్థిగా హరి ప్రసాద్ పోటీపడ్డారు. రాజ్యసభలో హరివంశ్‌కు కంగ్రాట్స్ చెప్పిన మోడీ.. డిప్యూటీ చైర్మన్ పదవి కోసం ఇద్దరు హరిలు పోటీపడ్డారని తెలిపారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను రెచ్చగొట్టేవిధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను విపక్ష అభ్యర్థి హరిప్రసాద్ తప్పుపట్టారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.  

పద ప్రయోగంతో మోడీ.. కాంగ్రెస్ అభ్యర్థిపై కొన్ని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో హరిప్రసాద్ మనస్తాపానికి గురయ్యారు. చైర్ హుందాతనాన్ని ప్రధాని దిగజార్చారని, సభ హుందాతనానికి కూడా నష్టం తీసుకువచ్చారని హరిప్రసాద్ ఆరోపించారు. అయితే పద ప్రయోగంతో విపక్ష అభ్యర్థిని ఇబ్బంది పెట్టిన మోడీ ప్రసంగం నుంచి వివాదాస్పద వ్యాఖ్యలను తొలిగిస్తున్నట్లు రాజ్యసభ సెక్రటేరియేట్ స్పష్టం చేసింది.
ప్రధాని వ్యాఖ్యలను పలువురు కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు. ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటని ... ప్రధాని స్థానంలో ఉండి ఈ వ్యాఖ్యలు చేయటం తగదని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అభిప్రాయపడ్డారు. మోడీ మంచి వక్త...ఆయన పద ప్రయోగం కూడా అద్భుతంగా ఉంటోంది. అయితే... సమయం సందర్భాన్ని బట్టి అలాంటి పద ప్రయోగాలు చేస్తే బాగుంటుందని శశిథరూర్ పేర్కొన్నారు. పార్లమెంటులో ప్రధాని వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించటం చాలా అరుదైన ఘటన. 2013లో ప్రధాని మన్మోహన్ సింగ్ ఆనాటి విపక్ష నేత అరుణ్ జైట్లీ ఒకరిపై ఒకరు చేసుకున్నవ్యాఖ్యలను రికార్డుల తొలగించారు. ప్రధాని వ్యాఖ్యలు మాత్రమే తొలగించటం ఇదే ప్రథమం.