టీఆర్ఎస్ పాలనలో ప్రజలు విసిగిపోయారు

టీఆర్ఎస్ పాలనలో ప్రజలు విసిగిపోయారు

టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు విసిగిపోయి ఉన్నారు అని మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఈ రోజు ఆయన సిద్దిపేట జిల్లా చేర్యాలలో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటకు కట్టుబడి ప్రతి పథకాన్ని అమలు చేసిందన్నారు. అధికారం కోసం ఆచరణకు సాధ్యంకాని హామీలతో కేసీఆర్ మోసం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో అభివృధ్ధిని చేసి చూపించామన్నారు. చేర్యాలలో మున్సిపల్ టాక్స్ ని వసూలు చేయడానికి షాపులకు తాళం వేసి ప్రజలను ఇబ్బందులు పెట్టిన ఘనత టీఆర్ఎస్ ది అని పొన్నాల మండిపడ్డారు.

గ్రామాల అభివృద్ధి ఏ మేరకు చేసారో చర్చించేందుకు టీఆర్ఎస్ నాయకులు సిద్ధమా? అని పొన్నాల లక్ష్మయ్య సవాల్ విసిరారు. గత నాలుగు సంవత్సరాల పరిపాలనలో అభివృద్ధి శూన్యం అని  విమర్శించారు. దానంపల్లి గ్రామంలో నీళ్లు లేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లిచ్చే ఓటు అడుగుతానన్న కేసీఆర్.. మాట తప్పి ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తున్నాడని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే చేర్యాలలో అభివృద్ధి జరిగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్ళీ ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగుపరిచి 9 రకాల నిత్యావసర వస్తువులను అందజేస్తాం అని ఆయన తెలిపారు. ఏం చేసారని కేసీఆర్ గ్రామాల్లో ఓట్లు అడుగుతారు. మీ అభ్యర్థులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.. ప్రజలు మీ నాయకుల్ని తరిమికొడుతున్నారు అని పొన్నాల అన్నారు.