14న అర్చకుడి భుజాలపై దళితుడి ఆలయ ప్రవేశం

14న అర్చకుడి భుజాలపై దళితుడి ఆలయ ప్రవేశం

మనుషులంతా ఒక్కటే. దేవుడి ముందు అందరూ సమానమే. దేవుడికి  కుల మత భేదాలు ఉండవు. ఇవన్నీ మనం సృష్టించుకున్నవే.. ఇది తెలిసినా.. దళితుల్ని దూరం పెట్టే వాళ్లు ఇంకా ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. ఇటువంటి తరుణంలో దళితుడికి ఆలయ ప్రవేశం కల్పించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు చిలుకూరు బాలజీ ఆలయ ప్రధానార్చకుడు, తెలంగాణ దేవాలయ పరిరక్షణ సమితి ఛైర్మన్ సీఎస్ రంగరాజన్. ఈయన స్ఫూర్తితో గుంటూరు జిల్లాకు చెందిన కల్యాణపురం విజయకుమార్‌ అనే అర్చకుడు కూడా దళితుడి ఆలయ ప్రవేశానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 14వ తేదీన గుంటూరులోని మోహన రంగనాయక ఆలయంలో కుళ్లాయ్‌ చిన్ననరసింహులును ఆలయంలోకి తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తున్నారు. రంగరాజన్‌ చేసినట్టుగానే చిన్ననరసింహులును భుజాలపై మోస్తూ దేవాలయ ప్రవేశం చేయిస్తానని చెప్పారు. నరసింహులు విషయానికి వస్తే.. అతనో రోజు కూలీ. చిత్తూరు జిల్లాలోని గాంధీపూర్‌ అనే గ్రామంలో నివసిస్తున్నాడు. స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికీ.. రామాలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇక.. 14వ తేదీన జరిగే కార్యక్రమానికి అయ్యే ఖర్చును తాను భరిస్తానని ఇదే జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్‌ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి చిలుకూరు బాలజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌ కూడా హజరవనున్నారు.