కుక్క పిల్లను కాపాడే ప్రయత్నమా..? లేక..?

కుక్క పిల్లను కాపాడే ప్రయత్నమా..? లేక..?

ప్రముఖ సినీ నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి తనయుడు భార్గవ్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించడం మిస్టరీగా మారింది. చెన్నైలో నివాసం ఉంటున్న భార్గవ్‌కు నెల్లూరు జిల్లా వాకాడు సమీపంలో రొయ్యల హేచరీ ఉంది.. దీని వ్యవహారాలు చూసుకునేందుకు ఆయన అప్పుడప్పుడు వస్తుండేవారు.. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి సమయంలో అక్కడికి వచ్చాడు.. అక్కడి పనివారితో మాట్లాడి 11 గంటల సమయంలో సముద్రం వద్దకు వెళ్లాడు.. అయితే ఎంత సేపటి వరకు తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు సముద్ర తీరంలో గాలించారు. కానీ ఆచూకీ లేకపోవడంతో తిరిగి వెనక్కివచ్చేశారు. ఈ నేపథ్యంలో ఉదయం సముద్ర తీరానికి ఓ గుర్తు తెలియని మృతదేహం కొట్టుకురావడంతో.. పోలీసుల దర్యాప్తులో మృతుడు నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి కుమారుడని తెలిసింది. అయితే అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా హత్య చేసి మృతదేహన్ని ఇక్కడ పడవేశారా అనేది తెలియక అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. కాగా, నీటిలో పడిపోయిన కుక్క పిల్లను కాపాడే ప్రయత్నంలో భార్గవ్ రెడ్డి మరణించారంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన భౌతికకాయానికి పోస్ట్ మార్టం జరుగుతోంది.. అది పూర్తయితే కానీ మరణం వెనుక అసలు రహస్యం ఏంటో తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు.