ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో నాదల్‌, థీమ్‌

ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో నాదల్‌, థీమ్‌

మట్టి కోర్టులలో తనదైన శైలిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించి స్పెయిన్‌ బుల్ రాఫెల్‌ నాదల్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. దీంతో 11వసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఫైనల్లోకి అడుగుపెట్టాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో 6–4, 6–1, 6–2తో ఐదో సీడ్‌ డెల్‌పొట్రో(అర్జెంటీనా)పై విజయం సాధించాడు. ఈ మ్యాచ్ తొలి సెట్లో పొట్రో పోటాపోటీగా పోరాడాడు. అయితే మూడు, తొమ్మిదో గేముల్లో బ్రేక్‌ సాధించే అవకాశాలను చేజార్చుకుని వెనుకంజ వేసాడు. ఇక పదో గేమ్‌లో నాదల్‌ బ్రేక్‌ సాధించి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. ఇదే ఊపులో తర్వాత రెండు సెట్లను కూడా గెలుచుకుని మ్యాచ్ ను సొంతం చేసుకున్నాడు. డెల్‌పొట్రోతో 2 గంటల 14 నిమిషాల పాటు నాదల్‌ పోరాడాడు. అయితే అందివచ్చిన అవకాశాలను డెల్‌పొట్రో సద్వినియోగం చేసుకోలేక పోరాడి ఓడిపోయాడు.

మరో సెమీఫైనల్లో థీమ్‌(ఆస్ట్రియా) 7-5, 7-6(12-10), 6-1తో మార్కో సెచినాటో(ఇటలీ)ను ఓడించాడు. ఈ మ్యాచ్ లో థీమ్‌ తొలి గేమ్‌లోనే సెచినాటో సర్వీస్‌ బ్రేక్‌ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. అయితే ఎనిమిదో గేమ్‌లో సెచినాటో బ్రేక్‌ సాధించి 5-4తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ వెంటనే థీమ్‌ పుంజుకుని వరుసగా మూడు గేమ్‌లు గెలిచి సెట్‌ను చేజిక్కించుకన్నాడు. ఇక రెండో సెట్‌ సుమారు గంట పాటు హోరాహోరీగా సాగదాంతో టైబ్రేక్‌కు దారితీసింది. థీమ్‌ మూడు సెట్‌ పాయింట్లు పొంది సెట్‌ను గెలుచుకున్నాడు. ఇదే క్రమంలో సునాయాసంగా మూడో సెట్‌ను గెలిచాడు.

తాజా విజయంతో రోజర్‌ ఫెడరర్‌(11 వింబుల్డన్‌) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో రికార్డు స్థాయిలో 11వసారి ఫైనల్‌ చేరిన రెండో ప్లేయర్‌గా నాదల్‌ గుర్తింపు పొందాడు. ఓవరాల్‌గా నాదల్‌ కెరీర్‌లో ఇది 24వ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌. ఇక థీమ్‌కు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌. థీమ్‌, నాదల్‌ ఇద్దరూ ఫామ్ లో ఉండటంతో ఫైనల్‌ రసవత్తరంగా సాగే  అవకాశమ్ ఉంది.మట్టి కోర్టులలో నాదల్‌ కు ఎదురేలేకున్నా.. క్లేకోర్టుపై నాదల్‌ను ఓడించిన ఏకైక ఆటగాడు థీమే. ఈ నేపథ్యంలో స్పెయిన్‌ బుల్ రాఫెల్‌ నాదల్‌కు ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలవడం అంత సులువేం కాలేదు.