నాదల్‌కే ఫ్రెంచ్‌ ఓపెన్‌...

నాదల్‌కే ఫ్రెంచ్‌ ఓపెన్‌...

క్లే కోర్టులపై తనకు తిరుగులేదని స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌(32) మరోసారి నిరూపించాడు. ఎలాంటి సంచనాలకు చోటివ్వకుండా అవవోకగా విజయం సాధించి 11వసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. రాఫెల్‌ నాదల్‌ దెబ్బకు డొమినిక్‌ థీమ్‌ వరుస సెట్‌లలో ఓడిపోయి ఫ్రెంచ్‌ ఓపెన్‌ను చేజార్చుకున్నారు. గత13 ఏళ్లలో ఈ ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఫైనల్‌కు చేరి 11 సార్లు అజేయంగా నాదల్‌ నిలిచాడు. ఆదివారం 2 గంటల 42 నిమిషాల పాటు జరిగిన పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ పోరులో రాఫెల్‌ నాదల్‌ 6–4, 6–3, 6–2తో డొమినిక్‌ థీమ్‌(ఆస్ట్రియా)ను మట్టికరిపించాడు.

తొలి సెట్‌ రెండో గేమ్‌లోనే థీమ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన నాదల్‌ 2–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. నాలుగో గేమ్‌లో నాదల్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన థీమ్‌.. స్కోరును సమం చేశాడు. ఇక తొమ్మిదో గేమ్‌లో 5–4తో ఆధిక్యంలోకి వెళ్లి అదే ఊపులో.. పదో గేమ్‌లో తొలి సెట్‌ను 6–4తో గెలుపొందాడు. ఇదే జోరును కొనసాగిస్తూ రెండో సెట్‌నూ కూడా కైవసం చేసుకున్నాడు. ఇక మూడో సెట్‌లో నాదల్‌ జోరుకు థీమ్‌ ఎలాంటి ప్రతిఘటనను ఇవ్వలేకపోయాడు. మూడో సెట్‌ ఎనిమిదో గేమ్‌లో థీమ్‌ కొట్టిన రిటర్న్‌ షాట్‌ కోర్ట్ బయటకు వెళ్లడంతో నాదల్‌ సెట్ తో పాటు టైటిల్ ను సొంతం చేసుకున్నాడు.

విజేతగా నిలిచిన నాదల్‌కు 22 లక్షల యూరోలు(రూ. 17 కోట్ల 48 లక్షలు), రన్నరప్‌ డొమినిక్‌ థీమ్‌కు 11 లక్షల 20 వేల యూరోలు(రూ. 8 కోట్ల 90 లక్షలు)ప్రైజ్‌మనీ లభించింది. తాజా విజయంతో నాదల్‌ ఖాతాలో 17 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ చేరింది. ఇందులో 11 ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్స్‌, మూడు యూఎస్‌ ఓపెన్‌, రెండు వింబుల్డన్‌, ఒక ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్స్‌ ఉన్నాయి. నాదల్‌ కంటే ఫెడరర్‌ అత్యధికంగా 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సాధించాడు.