వాజ్‌పేయికి పరామర్శల వెల్లువ

వాజ్‌పేయికి పరామర్శల వెల్లువ

అస్వస్థతతో బాధపడుతూ వైద్య పరీక్షల కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరిన మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్‌పేయిని వివిధ పార్టీల నేతలు, పలువురు ప్రముఖులు పరామర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా, బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ, కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఎయిమ్స్‌కి వెళ్లారు. వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా వాజ్‌పేయిని మర్యాద పూర్వకంగా కలుసుకొని పరామర్శించారు. వాజ్‌పేయి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎయిమ్స్‌ డైరెక్టర్ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా తెలిపారు. రొటీన్ చెకప్ లో భాగంగా ఆయనకు అన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. డాక్టర్ రణ్‌దీప్‌ గులేరియా ఆధ్వర్యంలో ఆయనకు వైద్యం అందిస్తున్నారు. 93 ఏళ్ల వాజ్‌పేయి కొంతకాలంగా అల్జీమర్స్‌ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన  రాజకీయాలు, పార్టీ వ్యవహారాలకు దూరంగా ఇంటికే పరిమితమయ్యారు.