బీజేపీ దేశాన్ని చీలుస్తోంది

బీజేపీ దేశాన్ని చీలుస్తోంది

బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల గాంధీ మరోసారి ద్వజమెత్తారు. భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్  రెండూ కలిసి దేశాన్ని విడదీస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన ఓబీసీ సమ్మేళన్ లో పాల్గొన్న ఆయన ఆర్ఎస్ఎస్ ప్రజలను విభజించేందుకు కుట్ర చేస్తోందని విమర్శించారు. ఓబీసీల మధ్య చిచ్చుపెట్టి, ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అందుకే ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు, ఇతర కులాల్లోని పేదలంతా ఒక్కటికావాలన్నారు. ఆర్ఎస్ఎస్, ఇద్దరు ముగ్గురు బీజేపీ నేతల చేతుల్లో దేశాన్ని బానిసగా మార్చారని రాహుల్ ఆరోపించారు. ఎంపీలు సైతం మాట్లాడేందుకు భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మనం ఏమైనా మాట్లాడినా ప్రస్తుతం బీజేపీ వినే పరిస్థితుల్లో లేదని ఆరోపించారు. కేవలం ఆర్ఎస్ఎస్ చెప్పిన మాటలు మాత్రమే కమల నాథుల చెవిన పడుతున్నాయని రాహుల్ విమర్శించారు. మోడీ కేవలం వ్యాపారులను మాత్రమే ప్రోత్సహిస్తున్నారనీ, రైతుల బాగోగులను పట్టించుకునే పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశ్రామికవేత్తలకు సులభంగా రుణాలు దొరుకుతున్నాయని తెలిపారు.

రైతులు మాత్రం బ్యాంకుల వైపు కాళ్లరిగేలా తిరిగినా రుణం ఇచ్చే వారు లేరని విమర్శించారు. గత నాలుగేళ్లలో చిన్న పారిశ్రామికవేత్తలకు సుమారు రూ. 2.5 లక్షల కోట్ల రుణాలు ఇచ్చారని తెలిపారు. నరేంద్ర మోడీ కార్యాలయంలో రైతు అనేవాడే కనిపించడని తెలిపారు. రైతు ఆత్మహత్యాలు జరుగుతున్నా రుణం మాఫికి మోడీ ప్రభుత్వం అంగీకరించటం లేదన్నారు.  కష్టపడి పనిచేసేవాడు ఎప్పుడూ వెనుకే ఉండిపోతాడని తెలిపారు. రైతులు, కూలీలు నెత్తురు ధారపోసి పనిచేస్తుంటే, లాభాలు మాత్రం వేరొకరు పొందుతున్నారని చెప్పారు. ఎవరి హక్కులు వారికి దక్కేలా ప్రభుత్వాన్ని నడపగల ఏకైక పార్టీ కాంగ్రెసే అని రాహుల్‌ చెప్పారు.