రాహుల్ ఆ పని కావాలనే చేశాడా?

రాహుల్ ఆ పని కావాలనే చేశాడా?

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో విపక్షాలను కాంగ్రెస్ కూడగట్టడంలో ఫెయిలవడం వల్లే ఎన్డీయే కు మరో విజయం సాధ్యమైందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో రాహుల్ కు ముందుచూపు లేకపోబట్టే తటస్థులు కూడా ఎన్డీయేకు ఓటేశారంటున్నారు మరికొందరు. కానీ రాహుల్ వేసిన స్టెప్ మాత్రం అవసరం కొద్దీ వేసిందే తప్ప అవగాహహనా రాహిత్యంతో కాదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీఆర్ఎస్, ఆప్, వైసీపీ వంటి పార్టీల మద్దతు కూడగట్టి ఉంటే యూపీఏ పక్షాలకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి దక్కేదన్న అభిప్రాయాలున్నా... కాంగ్రెస్ కు ఉండే పాజిటివ్ అంశాలను అంచనా వేయడం వల్లే ఎన్డీయే ఈ పోటీ లోంచి తప్పుకుందని, అందువల్లే తటస్థంగా ఉన్న జ‌న‌తాద‌ళ్ (యూ) అభ్యర్థిని ముందుకు తీసుకొచ్చిందని మ‌రికొంద‌రు అంటున్నారు. త‌ను పోటీ చేయ‌క‌..మ‌రో ప‌క్షానికి చెందిన అభ్య‌ర్థిని పెట్ట‌డంతో ఎన్డీయే కూటమి  బలహీనత బయట పడిపోయిందంటున్నారు వీరు. జ‌న‌తాద‌ళ్ యూ అభ్య‌ర్థిని తేవ‌డం వ‌ల్ల బీజేపీ మిత్ర‌ప‌క్షాలైన అకాళీద‌ళ్‌, శివ‌సేన బ‌హిరంగంగా మోడీపై విమ‌ర్శ‌ల‌కు దిగాయి. వచ్చే 2019 ఎన్నికలకు ముందే ఎన్డీయే కూటమికి బీటలు పడ్డాయ‌ని రాహుల్ స్ట్రాటజీ ద్వారా నిరూపించినట్టయిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే టీఆర్ఎస్‌, ఆప్, బీజేడీ వంటి పార్టీల మ‌ద్ద‌తు కోరి ఉన్నా రాజ్య‌స‌భ‌లో త‌న అభ్య‌ర్థి గెలిచేవార‌ని..కాని రాహుల్ ఇగోవ‌ల్ల ఆ ఛాన్స్ పోయింద‌ని మ‌రో వాద‌న‌. కాని కావాల‌నే వారి మ‌ద్ద‌తు రాహుల్ కోర‌లేద‌ని ఆ పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. తెలంగాణ‌లో తెరాస‌పై ఎడ‌తెర‌పి లేని యుద్ధం చేస్తోంది కాంగ్రెస్‌. కేవ‌లం రాజ్య‌స‌భ‌లో డిప్యూటీ కోసం తెరాస‌  మ‌ద్ద‌తు కోరితే రాష్ట్రంలో పార్టీ నైతికంగా దెబ్బ‌తింటుంద‌ని రాహుల్ భావించారు. అలాగే ఆప్ కూడా. ఇక బీజేడీతో జ‌త‌క‌డితే.. ఆ రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష హోదా బీజేపీకి వెళుతుంది. దీనివ‌ల్ల బీజేడీ, బీజేపీ మ‌ధ్య పోటీలో కాంగ్రెస్ నామ‌రూపాల్లేకుండా పోతుంది. ఇవ‌న్నీ ఆలోచించే రాహుల్ ఈ ఎన్నిక‌ల్లో దూకుడు త‌గ్గించార‌ని కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్లు అంటున్నారు.