పొదుపే కాదు, ఖర్చులోనూ మనమే మేటి

పొదుపే కాదు, ఖర్చులోనూ మనమే మేటి

పొదుపు చేయడమే కాదు ఖర్చు చేయడంలోనూ సౌత్‌ ఇండియన్స్‌ ముందున్నారు... ఓ వైపు సేవ్ చేస్తున్నారు... మరోవైపు బ్యాంకుల నుంచి అప్పులు కూడా తీసుకుంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాల ప్రకారం... దేశవ్యాప్తంగా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు పంపిణీ చేసిన వ్యక్తిగత రుణాలు అత్యధికంగా దక్షిణాది రాష్ట్రాలలో ఉన్నవే... 2017-18 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం దక్షిణ భారత దేశంలో 2017 సంవత్సరంలో రూ. 5.7 లక్షల కోట్ల వ్యక్తిగత రుణాలు మంజూరు చేయబడ్డాయి. ఇదే సమయంలో ఉత్తర భారతంలో రూ.2.5 లక్షల కోట్లు, పశ్చిమ భారతంలో రూ.3.9 లక్షల కోట్ల వ్యక్తిగత రుణాలు మంజూరు చేశారు.

ఇక దక్షిణ భారతంలోనే కర్నాటక అత్యధికంగా వ్యక్తిగత రుణాలు తీసుకుంటుంది... ఒక కర్నాటకలోనే రూ. 1.6 లక్షల కోట్లు వ్యక్తిగత రుణాలు తీసుకుంటే... తర్వాతి స్థానంలో రూ. 1.5 లక్షల కోట్లతో తమిళనాడు, రూ. 91,000 కోట్లతో కేరళ, రూ. 90,200 కోట్లతో తెలంగాణ, రూ. 72,100 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వాస్తవానికి దక్షిణ రాష్ట్రాల్లో వ్యక్తిగత రుణాల సెగ్మెంట్ వేగంగా పెరుగుతోంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇది 37 శాతం పెరుగుదలను నమోదు చేసింది. అదే ఉత్తర భారతంలో ఇది 21 శాతంగా ఉంటే.. పశ్చిమ రాష్ట్రాల్లో 14 శాతంగా ఉంది. ఇదిలా ఉంటే, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల్లో 40 శాతం వృద్ధిని లక్ష్యంగా చేసుకొని పబ్లిక్, ప్రైవేటు రంగ బ్యాంకులు పనిచేస్తుండడంతో కార్పొరేట్ రుణాలు విపరీతంగా పుంజుకున్నాయి. ఇక సేవింగ్ విషయంలోనూ రాష్ట్రాల వారీగా డేటా పరిశీలిస్తే దక్షిణ రాష్ట్రాలు రెండవ అతిపెద్ద సేవర్స్ అని లెక్కలు చెబుతున్నాయి. అత్యధికంగా కొర్పొరేట్ సంస్థలు ఉన్నందున పశ్చిమ రాష్ట్రాల డిపాజిట్లు రూ .28 లక్షల కోట్లుగా ఉంటే... దక్షిణ భారతంలో రూ .25 లక్షల కోట్ల డిపాజిట్ బేస్‌గా ఉంది. ఉత్తర భారతంలో ఇది రూ. 22 లక్షల కోట్లుగా ఉంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రతీ ఏడాది ఆరోగ్యకరంగా డిపాజిట్లు పెరుగుతున్నాయి. ఉదాహరణకు 2017-18 ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లు దక్షిణాదిన 13.1 శాతంగా పెరిగితే... అదే పశ్చిమ భారతానికి వచ్చే సరికి ఇది 4 శాతంగానే ఉంది.