రైతు బంధు పథకం తరవాతే బదిలీలు

రైతు బంధు పథకం తరవాతే బదిలీలు

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు బంధు పథకం ప్రారంభిస్తున్నందున ఈ నెలలో ఉద్యోగుల బదిలీలు ఉండవని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజిందర్‌ అన్నారు. రైతులకు చెక్కుల పంపిణి, పాసు పుస్తకాలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ పథకం పూర్తయిన తరవాత బదిలీ విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుదని ఆయన అన్నారు. ఇవాళ ఆయన నేతృత్వంలోని మంత్రుల కమిటి ఉద్యోగుల జేఏసీతో భేటీ అయింది. జేఏసీ సమర్పించిన 18 డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని అన్నారు. సీపీఎస్‌ విధానంపై తమ కమిటి ఓ నివేదిక తయారు చేసి సీఎంకు ఇస్తామని, తరవాత అందులోని వివరలు తెలుపుతామని మంత్రి తెలిపారు.
ఇవాళ ఉదయం ఉద్యోగ సంఘాల జేఏసీ మంత్రుల కమిటీతో భేటీ అయింది. 18 డిమాండ్లను మంత్రుల కమిటీ ఎదుట జేఏసీ పెట్టింది.  ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వివరించింది. మళ్ళీ రేపు మంత్రుల కమిటీతో భేటీ అవుతామని జేఏసీ నేతలు అన్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు కూడా రెగ్యులర్‌ ఉద్యోగుల మాదిరి పూర్తి స్థాయి జీతాలు ఇవ్వాలన్న తమ డిమాండ్‌ను జేఏసీ నేతలు పునరుద్ఘాటించారు. జూన్‌ 2వ తేదీలోగా ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు స్వరాష్ట్రానికి తీసుకురావాలని కూడా ఉద్యోగ సంఘాల నేతలు మంత్రుల కమిటీని కోరింది. వీలైనంత త్వరగా 11వ పీఆర్‌సీ  వేయాలని కోరింది. అదే విధంగా తాము ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నట్లుగా సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని కూడా ఉద్యోగులు కోరారు.