ఆ భూములు కొట్టేయడానికేనా...

ఆ భూములు కొట్టేయడానికేనా...

వైఎస్‌ రాకముందు జరిగిన భూముల కేటాయింపు గురించి ఇపుడు కేసీఆర్‌ ప్రస్తావించడం వెనక కుట్ర ఉందని రేవంత్‌ ఆరోపించారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన రేవంత్‌ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్‌ రాకముందు జరిగిన భూముల కేటాయింపులను ఇపుడు తిరిగ తోడి... భూములు పొందినవారిని బెదిరించి.. వారి నుంచి తమ బినామీలపేరున భూములు రాయించుకునే పన్నాగం కేసీఆర్‌ పన్నారని, అందుకే ఆనాటి కేటాయింపులపై సమీక్ష జరుపుతున్నారని రేవంత్‌ అన్నారు.
తస్మదీయులకు మినహాయింపా?
 తెలంగాణలో అధికార దుర్వినియోగం పెరిగిపోయిందని, అవినీతిపరులను కాపాడడంలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉందని రేవంత్‌ అన్నారు. 'అధారాలు లేవన్న కారణంగా 2016లో 125 అధికారులపై కేసులను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించింది. ఇది దేశంలోనే రికార్డు. అవినీతి పరులను కాపాడడంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందనడానికి ఇదే నిదర్శనం' అని అన్నారు. ఏసీబీ కేసులపై కేసీఆర్‌ సమీక్ష చేయడం సంతోషమేనని..ఐతే ఆధారాలతో సహా దొరికిపోయిన అవినీతి అధికారులను విడిచిపెట్టడం సరికాదని అన్నారు. ముఖ్యంగా కేసీఆర్‌ బంధువులపై కేసులను అకారణంగా ఉపసంహరిస్తున్నారని రేవంత్‌ మండిపడ్డారు.  2013లో నిమ్స్‌లో విభాగాధిపతి శేషగిరిరావు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుబడ్డారని.. ఆ కేసును కూడా 2017లో మూసివేశారని అన్నారు. 'ఈ కేసులో సాక్షాత్తూ మాజీ ఎంపీ ఫిర్యాదు చేశారు. అయినా న్యాయం జరగలేదు' అని రేవంత్‌ విమర్శించారు. ఆధారాలున్నా ఇటువంటి అనేక కేసులను మూసివేస్తున్నారని పేర్కొన్న రేవంత్‌.. ముఖ్యంగా తన సామాజిక వర్గానికి చెందిన నేతలను  కేసీఆర్‌ విడిచిపెడుతున్నారని ఆరోపించారు. 
కాగ్‌ నివేదిక పట్టదా..?
సాక్షాత్తూ ఐటీ మంత్రి కేటీఆర్‌ శాఖ పరిధిలోని టీహబ్‌లో అవినీతి జరిగిందని కాగ్‌ నివేదిక ఇచ్చినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని రేవంత్‌ ప్రశ్నించారు. తప్పు చేస్తే కొడుకైనా, కూతురైనా వదిలేది లేదని చెప్పిన కేసీఆర్‌.. కాగ్‌ నివేదికను గాలికోదిలేశారని విమర్శించారు.