కేసీఆర్ నలుగురికి వీసా ఇప్పించాడు

కేసీఆర్ నలుగురికి వీసా ఇప్పించాడు

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. అలాగే హరీశ్ రావు మీద కూడా అదే స్థాయి ఆరోపణలు చేశారు. కేసీఆర్ గుజరాత్ కు చెందిన నలుగురికి వీసాలు ఇప్పించారని, హరీశ్ రావు కూడా తన భార్య పిల్లల పేర్లతో గుజరాత్ మహిళలను అమెరికాకు పంపించినట్లు రషీద్ తన వాగ్మూలం లో చెప్పాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మనుషుల అక్రమ రవాణా పేరుతో జగ్గారెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు.. ఆ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తమ మీద ఉందన్న రేవంత్.. 2002లో మహ్మద్ రషీద్ అనే వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడని, వీసా కుంభకోణంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నట్లు రషీద్ వాంగ్మూలం ఇచ్చాడన్నారు. అప్పుడు సీఐడీ కేసును విచారించి 5 పేజీల నివేదికను తయారు చేసిందని, పూర్తి స్థాయిలో విచారించకుండానే కేసును పక్కన పెట్టారన్నారు. మహేందర్ రెడ్డి కమిషనర్ అయ్యాక కేసు చార్జిషీట్ కోర్టుకు సమర్పించారని, అయితే ప్రభుత్వ పెద్దలను కేసు నుంచి తప్పించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ల పేర్లు మాత్రమే పెట్టారని.. ఈ క్రమంలోనే జగ్గారెడ్డి అరెస్టు జరిగిందన్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం శాంతిభద్రత ల వ్యవస్థ గవర్నర్ చేతిలో ఉందని, పోలీసులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుంటే గవర్నర్ ఎందుకు మౌనంగా ఉన్నారని రేవంత్ ప్రశ్నించారు. ఇక కేసీఆర్ పీఏ అజిత్ రెడ్డి రూ. 20 లక్షలకు ఒప్పందం చేసుకొని కొందరికి వీసాలు ఇవ్వడానికి సహకరించినట్లు మరో ఆరోపణ చేశారు రేవంత్. 

హరీశ్ పేరు బయటపెడతాను అన్నందుకే డీజీపీ పోస్టు
ఇక మహేందర్ రెడ్డికి డీజీపీ పోస్టు రావడంలో కూడా హరీశ్ రావు వీసా అంశమే ఉందన్నారు రేవంత్. హరీశ్ పేరు బయట పెట్టకుండా ఉండేందుకే మహేందర్ రెడ్డికి డీజీపీ పోస్టు ఇచ్చారని ఆరోపించారు. గండ్ర వెంకటరమణారెడ్డిని ఎర్రబెల్లి రవీందర్ రావు బెదిరించినా.. ఆయన్ని వదిలేసి గండ్ర మీద కేసు పెట్టారని ఆరోపించారు. బెదిరించిన వాళ్ళను వదిలేసి, బాధితులపై కేసులు పెడుతున్నారని పోలీసుల్ని విమర్శించారు. మరో 3 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని.. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెసే అధికారంలోకి వస్తుందని, తమను వేధించిన అధికారులకు వడ్డీతో చెల్లిస్తామని ఆవేశంగా అన్నారు రేవంత్.