పంత్‌కు బేసిక్స్ కూడా సరిగా లేవు

పంత్‌కు బేసిక్స్ కూడా సరిగా లేవు

టీమిండియా యువ వికెట్ కీపర్‌ రిషబ్ పంత్‌కు బేసిక్స్ కూడా సరిగా లేవు అని మాజీ వికెట్ కీపర్ నయన్ మోంగియా అభిప్రాయపడ్డారు. ఇంగ్లాండ్ తో ఐదు టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి రెండు టెస్టుల్లో విఫలమైన వికెట్ కీపర్‌ దినేశ్ కార్తీక్‌ స్థానంలో రిషబ్ పంత్‌కి మిగిలిన టెస్టులలో మేనేజ్‌మెంట్ చోటు కల్పించింది. మూడు టెస్టుల్లో బ్యాట్ తో సఫలం అయినా.. కీపింగ్ లో మాత్రం గోరంగా విఫలమయ్యాడు. వికెట్ల వెనుక డైవ్ క్యాచ్‌లు పట్టిన పంత్.. మూడు టెస్టుల్లో 76 పరుగులను బైస్‌ రూపంలో ఇచ్చి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు.

తాజాగా మాజీ వికెట్ కీపర్ నయన్ మోంగియా మాట్లాడుతూ... వికెట్ కీపింగ్‌లో రిషబ్ పంత్ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాడు. ఐపీఎల్‌ ప్రదర్శనతో కీపర్‌గా ఎంపిక చేసిన సెలక్షన్ పాలసీది తప్పు అని పేర్కొన్నాడు. పంత్ టెస్టులోకి రావడానికి చాలా సమయం ఉంది అని అభిప్రాయపడ్డారు. పంత్‌కు బేసిక్స్‌ కూడా సరిగా లేవు. ఇంగ్లాండ్ లో స్పిన్నర్ల బౌలింగ్‌లో అతను వికెట్ల వెనుక బంతిని సరిగా అందుకోలేకపోతున్నాడు. ఉపఖండం పిచ్‌లపై అశ్విన్, జడేజాల బౌలింగ్ లో కూడా చివరి రెండు రోజులు పంత్ ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొనే అవకాశం ఉంది. పేసర్ల బౌలింగ్ లో కేవలం డైవింగ్ లు మాత్రమే చేస్తున్నాడు.. స్థిరత్వం అవసరం అని తెలిపారు.

తాజాగా జరిగిన దులీప్ ట్రోఫీలో పార్థీవ్ పటేల్ ప్రదర్శన బాగుంది. ఈ టెస్టులకి పార్థీవ్ పటేల్ ను ఎంచుకుంటే బాగుండేది. టెస్టులలో సీనియర్ వికెట్ కీపర్లు పార్థీవ్ పటేల్, దినేశ్ కార్తీక్‌కి మళ్లీ అవకాశం ఇస్తారని అనుకోవడం లేదు. అయితే ఒక సిరీస్ తర్వాత యువ వికెట్‌ కీపర్‌ని పక్కన పెట్టాలని కూడా అనికోవట్లేదని పేర్కొన్నారు. భారత యువ క్రికెటర్లకు ఎందుకు స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేయడం లేదో అర్ధం కావడం లేదని నయన్ మోంగియా అన్నారు.