రైజింగ్ కశ్మీర్ ఎడిటర్ కాల్చివేత

 రైజింగ్ కశ్మీర్ ఎడిటర్ కాల్చివేత

 

సీనియర్ జర్నలిస్ట్, రైజింగ్ కాశ్మీర్ దినపత్రిక సంపాదకుడు.. షుజాత్ బుఖారీని గురువారం సాయంత్రం కొందరు దుండగులు కాల్చి చంపారు. శ్రీనగర్ లోని ప్రెస్ కాలనీలో ఉన్న తన కార్యాలయం నుంచి బయటికి వస్తుండగా అతి సమీపం నుంచి అగంతకులు బుల్లెట్ల వర్షం కురిపించారు. షుజాత్ శరీరంపై అనేక బుల్లెట్ గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఆయనకు భద్రత కల్పించే ఇద్దరు సెక్యూరిటీ గార్డులకు కూడా గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. చాలా కాలం తర్వాత కాశ్మీర్ లోయలో ఒక జర్నలిస్ట్ పై దాడి జరగడం ఇదే ప్రథమం. ఈ సంఘటన స్థానిక పాత్రికేయ వర్గాల్లో సంచలనం రేపింది. పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిని పాత్రికేయ లోకం ముక్తకంఠంతో ఖండించింది. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తమ ట్విట్టర్ సందేశాల్లో దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇంతకు ముందు షుజాత్ బుఖారీపై 2000లో దాడి జరిగింది. అప్పటి నుంచి ఆయనకు పోలీసు భద్రత కల్పించారు.