"ఇవి ప్రతీకార రాజకీయాలు"

"ఇవి ప్రతీకార రాజకీయాలు"

దేశ రాజధాని ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా కార్యాలయం, వాద్రా ఉద్యోగుల ఇళ్లపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అకస్మాత్తుగా దాడి చేసింది. ఒకేసారి తనిఖీ బృందాలు బెంగుళూరులోని వాద్రా వ్యాపార సహచరుల ఆస్తులపై కూడా సోదాలు నిర్వహించాయి. నియంతృత్వ ధోరణితో వ్యవహరించిన ఈడీ అధికారులు ఈ ఉదయం 9 గంటల సమయంలో ఉద్యోగులను తాళం వేసి బయటికి పోనీయకుండా వాద్రా ఆస్తులపై దాడి చేసినట్టు వాద్రా తరఫు న్యాయవాది సుమన్ ఖైతాన్ ఆరోపించారు. ‘స్కైలైట్ హాస్పిటాలిటీ లోపల ఉద్యోగులను బంధించారు. వారిని ఎవరినీ కలవనీయకుండా నిర్బంధించారు. ఇది నాజీజిమా? ఇది జైలా?‘ అని ఆయన ప్రశ్నించారు.

సుఖ్ దేవ్ విహార్ కార్యాలయం, ఇద్దరు ఉద్యోగుల ఇళ్లపై ఈడీ అధికారులు అక్రమంగా దాడి చేసినట్టు ఖైతాన్ తెలిపారు. ‘ఇది పూర్తిగా అక్రమం. చట్టప్రకారం కార్యాలయం తెరిచే వరకు వేచి చూడాల్సి ఉండగా వాళ్లు కనీసం అంత సమయం కూడా ఆగలేదు. చట్టవిరుద్ధంగా తాళాలు బద్దలుకొట్టి కార్యాలయం లోపలికి ప్రవేశించారు. ఆఫీసు లోపల అన్ని క్యాబిన్ల తాళాలు బద్దలు కొట్టి తెరిచారు. ఆఫీసులో ఉదయం 8-9 గంటల నుంచి ఈడీ ఆఫీసర్లు ఉన్నారు. లాయర్లను కానీ, ప్రతినిధులను కానీ లోపలికి అనుమతించలేదని‘ చెప్పారు.

రాజస్థాన్ లోని కొలాయత్ లో జరిగిన ఒక భూమి వ్యవహారంపై దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహించారు. వాద్రాకి చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ 69.55 హెక్టార్ల భూమిని రూ.72 లక్షలకు కొనుగోలు చేసింది. తర్వాత దానిని అలీజెనీ ఫిన్ లీస్ కు రూ.5.15 కోట్లకు అమ్మింది. మోసంతో రూ.4.43 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఈ వ్యవహారం గురించి తనకేమీ తెలియదని వాద్రా చెబుతున్నారు. మోడీ ప్రభుత్వం తనను, తన సహచరులను వేధిస్తోందని ఆరోపిస్తున్నారు. ‘ఇప్పటికే నాలుగైదేళ్లు గడిచాయి. ఇప్పటి వరకు వారికేమీ దొరకలేదు. మమ్మల్ని బయట ఉంచి లోపల తప్పుడు సాక్ష్యాధారాలను ఉంచుతున్నారని‘ ఖైతాన్ ఆరోపించారు.