రూ.100 కోట్ల భూమి ఫ్రీగా రాసిచ్చేశాడు

రూ.100 కోట్ల భూమి ఫ్రీగా రాసిచ్చేశాడు

వక్ఫ్‌కు చెందిన భూములను లంచం మెక్కి ప్రైవేట్‌ వ్యక్తికి కట్టబెట్టిన ఉదంతం మరోటి బయటపడింది. బోర్డుకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు లంచం తీసుకుని కోట్ల విలువైన భూమిని ఓ ప్రైవేట్‌ వ్యక్తికి ధారదత్తం చేశాడు. ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో వక్ఫ్‌ బోర్డు సోమవారం సీఐడీ విచారణ కోరుతూ ప్రభుత్వాని విజ్ఞప్తి చేయనుంది. హైదరాబాద్‌... మల్కాజిగిరిలో సుమారు రూ 100 కోట్ల విలువ జేసే అయిదెకరాల స్థలాన్ని బోర్డు చీప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) ఎంఏ మన్నన్‌ ఫరూకీ 2017లో ఓ ప్రైవేట్‌ వ్యక్తికి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఓసీ) ఇచ్చేశాడు. దీనికి గాను సీఈఓకు రూ. 25 లక్షలకు, మరో మధ్యవర్తికి రూ. 10 లక్షలకు కొనుగోలుదారుడు చెల్లించినట్లు తెలుస్తోంది. ఫరూకీ మొన్నటి దాకా బోర్డుకు సీఈఓగా ఉన్నారు. ఎన్ఓసీ 2017 మే 26వ తేదీన జారీ అయింది. సదరు భూమి వక్ఫ్‌ భూమి కాదంటూ ఎన్‌ఓసీ ఇచ్చారు సీఈఓ. ఈ కుంభకోణం గురించి సోమవారం జరిగే వక్ఫ్‌ బోర్డు సమావేశంలో చర్చిస్తామని సంస్థ ఛైర్మన్‌ మొహమ్మద్‌ సలీమ్‌ తెలిపారు. ఈ భూమికి ఎన్‌ఓసీ ఇచ్చే ఫైల్‌ను సీఈఓ ఫరూకీ తన దృష్టికి కూడా తీసుకురాలేదని బోర్డు ఛైర్మన్‌ ఆరోంచారు. బోర్డు సమావేశంలో కూడా ప్రవేశపెట్టలేదని ఆయన అన్నారు. అకస్మాత్తుగా ఫరూకీ సెలవుపై వెళ్ళడం, అలాగే తనను మళ్ళీ న్యాయవిభాగానికి బదిలీ చేయాలని కోరడంతో తమకు అనుమానం వచ్చిందని సలీమ్‌ అన్నారు. అనుమానం తాను దర్యాప్తు జరగా ఈ భూ కుంభకోణం బయటపడిందన్నారు. ఎన్‌ఓసీ కోసం లంచం ఇచ్చిన విషయాన్ని కొనుగోలుదారుడు తనకు తెలిపాడన్నారు. ఈ భూములు అత్తాపూర్‌లోని మీర్‌ మొహ్మద్‌ పహాడీకి చెందినవి. ఈ వక్ఫ్ సంస్థకు అత్తాపూర్‌, మల్కాజ్‌గిరిలో భూములు ఉన్నాయి.

విషయం తెలిసిన వెంటనే అబిడ్స్‌ పోలీస్ స్టేషన్‌లో బోర్డు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కుంభకోణంపై ఏసీబీ దర్యాప్తు జరపాలని బోర్డు  భావిస్తోంది. 1956 నుంచి జారీ అయిన ఎన్‌ఓసీలపై ఏసీబీ దర్యాప్తుకు ఆదేశించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరుతూ లేఖ రాయలని కూడా బోర్డు భావిస్తోందని సంస్థ ఛైర్మన్‌ సలీమ్‌ అన్నారు. అయితే ఈ ఆరోపణలను సీఈఓ ఫరూకీ ఖండిస్తున్నారు. ఫైల్‌ ఉన్నది తన సంతకం కాదని, అది ఫోర్జరీ అని అంటున్నారు.

ఫోరెన్సిక్‌ దర్యాప్తు కూడా...

ఎన్‌ఓసీకి సంబంధించిన ఫైల్‌ ఉన్న సంతకం ఒరిజనల్‌ సంతకమేనని బోర్డుకు చెందిన ఫోరెన్సిక్‌ విభాగం అంటోంది. ఈ మేరకు తాము ఫైల్‌ను పరిశీలించామని ఫైల్‌పై ఉన్న సంతకం ఫోర్జరీ కాదని తేల్చింది. ఈ భూముల కోసం లంచం ఇచ్చిన వ్యక్తి బోర్డును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగోలోకి వచ్చింది. సోమవారం జరిగే బోర్డు సమావేశంలో కొనుగోలుదారుడు స్వయంగా జరిగిన అంశాలను సభ్యులకు వివరిస్తారని సలీమ్‌ మీడియాకు తెలిపారు.