దీవాన్‌ హౌసింగ్‌లో రూ. 31,000 కోట్ల స్కామ్‌

దీవాన్‌ హౌసింగ్‌లో రూ. 31,000 కోట్ల స్కామ్‌

ప్రముఖ నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ దీవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) భారీ కుంభకోణానికి పాల్పడిందని పరిశోధనాత్మక కథనాలు చేసే కోబ్రాపోస్ట్‌ వెబ్‌సైట్ ఆరోపించింది. సుమారు లక్ష కోట్ల ప్రజాసొమ్ము బ్యాంక్‌ వద్ద ఉందని.. బినామీ కంపెనీల పేరున భారీ మొత్తాన్ని ఇతర దేశాలకు తరలించినట్లు కోబ్రా పోస్ట్‌ పేర్కొంది. దీని కోసం అనేక షెల్‌ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు తమ పరిశోధనలో వెల్లడైందని కోబ్రా పోస్ట్‌ పేర్కొంది.  పరిశోధన వివరాలను ఇవాళ ఢిల్లీలో బయటపెట్టారు. దాదాపు రూ. 31,000 కోట్ల స్కామ్‌కు పాల్పడినట్లు పేర్కొన్నారు. దీవాన్‌ హౌసింగ్‌కు ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ మొత్తంలో నిధులు ఇచ్చాయి. వివిధ రకాల పద్ధతుల్లో గ్రాంట్లు, రుణాల పేరున అనేక బోగస్‌ కంపెనీలకు నిధులు తరలించినట్లు పేర్కొన్నాయి. ఇటీవలి కాలంలో పీఎన్‌బీ, యాక్సిస్‌ బ్యాంక్‌తో పాటు ఇటీవల ఐసీఐసీఐ బ్యాంక్‌ కూడా పలు ఆరోపణలకు కేంద్ర బిందువులుగా మారాయి.

కోబ్రా పోస్ట్‌ కథనం మేరకు.. ఎస్‌బీఐతో పాటు పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు దీవాన్‌ హౌసింగ్‌కు సుమారు రూ. 96,880 కోట్లు ఇచ్చినట్లు తెలిపింది. అయితే కొటక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ వంటి ప్రైవేట్‌ బ్యాంకులకు ఈ స్కామ్‌తో ప్రమేయం లేదని పేర్కంది కోబ్రాపోస్ట్‌. అలాగే దీవాన్‌ హౌసింగ్‌... బీజేపీకి భారీ ఎత్తున విరాళాలు ఇచ్చిటన్లు కోబ్రా పోస్ట్‌ వెల్లడించింది. దీవాన్‌కు చెందిన పలు కంపెనీలు సుమారు రూ. 19.6 కోట్లు బీజేపీకి విరాళంగా ఇచ్చినట్లు తెలిపింది. ఆర్‌కే డెవలపర్స్‌ అనే కంపెనీ దీవాన్‌కు అనుబంధ సంస్థ. ఈ కంపెనీకి కూడా బీజేపీకి రూ. 9.93 కోట్ల విరాళం ఇచ్చినా... బహిరంగంగా వెల్లడించలేదని కోబ్రాపోస్ట్‌ ప్రతినిధులు తెలిపారు.